కలం, ఖమ్మం బ్యూరో: కేంద్రం ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, ఓట్ల తొలగింపు పేరిట కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకు కుట్రలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం జిల్లా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కో-ఇన్‌చార్జి సచిన్ సావంత్, స్థానిక ఎంపీ రఘురామ్ రెడ్డి, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై మంత్రి పొంగులేటి (Minister Ponguleti) మాట్లాడారు. ఎస్ఐఆర్ అనే ప్రక్రియను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీతో కలిసి బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచే దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల ఓట్లే లక్ష్యంగా సుమారు 67 నుంచి 68 లక్షల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేసిందని, మరో 70 లక్షల ఓట్లతో ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు రాబోయే 4-5 రోజుల్లో బూత్ స్థాయి కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా నెలకు రూ.4 నుంచి 5 కోట్లు ఖర్చు చేస్తూ, ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ శ్రేణులంతా ఆ విషప్రచారాలను ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలను గెలుచుకుని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే కాంగ్రెస్ శ్రేణుల ప్రధాన లక్ష్యమని పొంగులేటి స్పష్టం చేశారు.
Also Read : రేగా కాంతా రావుకు హై కోర్టులో ఊరట
Follow Us On : WhatsApp

