కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) ఉమ్మడి జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), ఇంచార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ శెట్కర్, మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ, మల్లికార్జున్, కార్పొరేషన్ చైర్మన్లు, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, ఆకుల లలిత, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గత PAC సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలకు వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం కల్పించినట్లు తెలిపారు. ఓటరు జాబితాల సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు అధికంగా జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs) అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
2002 ఆధారిత పత్రాల పరిశీలనతో పాటు ఓటరు జాబితాల వివరాల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, సవరణ ప్రక్రియ సజావుగా జరగని ప్రాంతాలపై డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మండల కాంగ్రెస్ కమిటీల నియామక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త బాధ్యత అని ఆయన అన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో నాయకులు చురుకుగా పనిచేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.

