కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని, అయితే అందులో భాగమైన 6 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు జీతాలు ఎందుకు చెల్లించడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బాధితులైన లైసెన్స్డ్ సర్వేయర్లు ఆయనను కలసి తమ వేదనను వెళ్లబోసుకున్నారు. గత నాలుగు నెలలుగా రూపాయి జీతం రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని సర్వేయర్లు వాపోయారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం తీవ్రతరం చేయాలని సర్వేయర్లకు పిలుపునిచ్చారు. సరిగ్గా ఢిల్లీ తరహాలోనే తెలంగాణలో కూడా ఆందోళనలు తీవ్రమవుతాయని హెచ్చరించారు. ఇటీవల జెన్-జీ చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలోని 6 వేల మంది సర్వేయర్లు ఒక్కసారిగా తిరగబడితే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఆ నిరసన తాకిడిని తట్టుకోలేరని హెచ్చరించారు.
జీతాలు అందక తీవ్ర మనస్తాపానికి గురై ఇద్దరు యువ లైసెన్స్డ్ సర్వేయర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని హరీశ్ రావు ఆరోపించారు. సమయానికి జీతాలు, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, ట్రావెల్ అలవెన్స్ వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఉద్యోగులు విలవిలలాడుతున్నారని పేర్కొన్నారు. పెట్రోల్ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నా, సర్వే ద్వారా వచ్చే ఆదాయం అత్యంత స్వల్పంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై కలెక్టర్లకు విన్నవిస్తే ‘అడుక్కోండి లేదా లంచాలు తీసుకోండి’ అని బాధ్యతారాహిత్యంగా సమాధానాలు ఇస్తున్నారని మండిపడ్డారు.
బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీశ్ రావు హామీ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలలో సర్వేయర్ల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని తేల్చి చెప్పారు. రెండేళ్లలో మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు ప్రతీ ఒక్కరినీ కాపాడుకుంటామని పేర్కొన్నారు.

