కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమకారుల (Telangana Activists) గుర్తింపు ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నవారిని గుర్తించేందుకు 16 రోజుల పాటు ప్రజాసంఘాలు, ఉద్యమకారులు, జేఏసీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి దాదాపు 13 వేలకు పైగా విజ్ఞప్తులను స్వీకరించిన ప్రత్యేక కమిటీ డ్రాఫ్ట్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నది. ఉద్యమకారులను మొత్తం ఐదు కేటగిరీలుగా వర్గీకరించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై మరింత విస్తృతంగా చర్చించిన తర్వాత ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనుంది.
కమిటీ స్వీకరించిన అభిప్రాయాలు, విజ్ఞప్తుల ఆధారంగా రూపొందించిన ముసాయిదా నోట్‌పై చైర్మన్ కేశవరావు అధ్యక్షతన హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మోతె శోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉద్యమంలో దాదాపు 1,400 మంది అమరులైనట్లు కమిటీ గుర్తించింది. గతంలో సాయం పొందని అర్హులైన కుటుంబాలకు ఇప్పుడు న్యాయం చేసేందుకు తొలి కేటగిరీలో చేర్చాలని కమిటీ అభిప్రాయపడింది.
గుర్తింపు క్రైటీరియా ఇలా..
ఉద్యమంలో అమరులైనవారి కుటుంబాలను (సుమారు 1,400 మంది అమరులు) తొలి కేటగిరీ కింద కమిటీ తీసుకుంది. పోలీసు కాల్పులు, లాఠీచార్జీల్లో శాశ్వత అంగవైకల్యానికి గురైనవారు, ఆత్మహత్యాయత్నాల్లో తీవ్రంగా గాయపడినవారిని రెండో కేటగిరి కింద చేర్చింది. 1969 తొలిదశ ఉద్యమంతో పాటు మలిదశ ఉద్యమంలో ప్రివెంటివ్ కస్టడీ, జ్యుడీషియల్ రిమాండ్ లేదా జైలు జీవితం గడిపిన విద్యార్థులు, ఉద్యమకారులను మూడో కేటగిరీగా ఎంచుకున్నారు. ఉద్యమ సమయంలో క్రిమినల్, బెయిలబుల్, నాన్-బెయిలబుల్ కేసులు ఎదుర్కొన్న వారిని నాలుగో కేటగిరీగా చేర్చారు. కేసులు నమోదు కాకపోయినా ఉద్యమ నిర్మాణంలో క్రియాశీలకంగా పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు, మహిళా ఉద్యమకారులు, ధూమ్‌ధామ్ కళాకారులు, వివిధ సంస్థల సభ్యులు ఐదో కేటగిరీలో ఉన్నారు.
సత్కారం.. సహాయం.. సహకారం
ఉద్యమకారులకు సత్కారం, సహాయం, సహకారం అనే మూడు పద్ధతుల్లో గౌరవం కల్పించాలని కమిటీ భావిస్తోంది. ఇప్పటికే ఉద్యోగాలు, స్థిర నివాసం ఉన్నవారు కేవలం గుర్తింపు కార్డు, ప్రశంసాపత్రం కోరుతున్నారని స్వీకరించిన దరఖాస్తుల ద్వారా కమిటీ ఒక అంచనాకు వచ్చింది. నిరుపేద, నిరుద్యోగ ఉద్యమకారులు 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం, పెన్షన్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, పిల్లలకు ఉచిత విద్య, స్వయం ఉపాధి రుణాలు వంటి సదుపాయాలను కోరుతున్నారని కమిటీ తెలిపింది. ఉద్యమకారుల సంక్షేమానికి చట్టబద్ధత కల్పించడంతోపాటు జార్ఖండ్, ఉత్తరాఖండ్ తరహాలో శాశ్వత కమిషన్,లేకుంటే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు కూడా సంప్రదింపుల్లో వచ్చినట్లు కమిటీ వెల్లడించింది. ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలో అధికారిక వెబ్సైట్ లేదా ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ భావిస్తున్నది.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ
ఉద్యమకారులు పారదర్శకంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని రూపొందించాలని కమిటీ భావిస్తున్నది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో విస్తృతంగా చర్చలు జరపడంతోపాటు మిగిలిన ప్రజాసంఘాల ప్రతినిధులతోనూ సంప్రదింపులు పూర్తిచేసిన తర్వాత స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనున్నది. ఇప్పటివరకు నిర్వహించిన అన్ని సమావేశాలు, సంప్రదింపుల మినిట్స్‌తో సమగ్ర నివేదికను రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పించాలని కమిటీ సమావేశంలో నిర్ణయించింది.

