కలం, తెలంగాణ బ్యూరో : కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ స్కీమ్ల అమలుపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ప్రాథమిక స్థాయిలో దీనిపై చర్చ జరిగినా నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. ఈ పథకాల కింద ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న లక్షా నూట పదహారు రూపాయలకు అదనంగా మరో రూ. 50 వేలను చేర్చాలన్నది కొత్త ఆలోచన. ఈ ప్రతిపాదన ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ లబ్ధిదారులందరికీ వర్తించనున్నది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్సు ఉంది.
గత ప్రభుత్వంలో ఉనికిలోకి వచ్చిన ఈ స్కీమ్‌లను యథావిధిగానే కొనసాగిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వం కూడా ‘అదనంగా రూ. 50వేలు’పై త్వరలో స్పష్టత ఇవ్వనున్నది. ఎలాగూ సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు పెడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చినందున ఈ స్కీమ్‌కు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచడంపైనా అసెంబ్లీ వేదికగానే ప్రకటించే అవకాశం కనిపిస్తున్నది.
అదనంగా రూ. 700 కోట్లు!
గత ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్‌లు అయినప్పటికీ వాటిని కొనసాగిస్తున్నామని 2024 డిసెంబర్ లోనే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ స్కీమ్ ల ద్వారా లబ్ధి పొందినవారి సంఖ్య, ప్రభుత్వం చేసిన ఖర్చు లెక్కలను ఇటీవల మంత్రి పొన్నం వివరించారు. త్వరలో రూ. 50 వేల సాయాన్ని అదనంగా ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడంతో ప్రతి ఏటా ప్రభుత్వం ఎంత మేర కేటాయించాలనే అంశంపై అధికారులు లెక్కలేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ డిపార్టుమెంట్ల ద్వారా ఈ స్కీమ్‌ల అమలవుతున్నందున అక్కడి నుంచి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత తేలనున్నది. సగటున ఏటా రూ. 1,400 కోట్లకు పైగా సాయం దాదాపు లక్షన్నర మంది లబ్ధిదారులకు అందుతున్నది. ఇప్పుడు ఒక్కో లబ్ధిదారుపై రూ. 50 వేల చొప్పున పెంచితే అదనంగా రూ. 700 కోట్ల మేర అవసరమవుతుంది.
బీఆర్ఎస్ విమర్శలకు చెక్ పెట్టేలా!
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ స్కీమ్‌లను పకడ్బందీగా అమలు చేస్తే ఆ క్రెడిట్ ఆయనకే వెళ్తున్నందన్న ఉద్దేశంతో వీటిని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నదంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు ఇటీవల విమర్శలు చేశారు. ఇందుకు హైకోర్టు ఇటీవల విధించిన మధ్యంతర స్టే ఉత్తర్వులను వారు ప్రస్తావిస్తున్నారు. హైకోర్టులో వాదనల సందర్భంగా ప్రభుత్వం ఈ స్కీమ్‌లకు సంబంధించిన లబ్ధిదారులు, ప్రభుత్వ సాయం గురించి వివరించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, ఇటీవల బంగారం ధరలు గణనీయంగా పెరగడంతో దానికి ప్రత్యామ్నాయంగానే రూ. 50 వేలు అదనంగా ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. తులం బంగారంపై బీఆర్ఎస్ నేతలు పదేపదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాజా ఆలోచనపై స్వయంగా ముఖ్యమంత్రే ప్రజలకు వివరణ ఇవ్వాలని భావిస్తున్నారు.
స్వయంగా ప్రజలకు చెప్పనున్న సీఎం
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు విషయంలో కొన్ని ఇంకా ప్రారంభం కాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే వివరణ ఇచ్చారు. మేనిఫెస్టోలో హామీలను ఇచ్చేటప్పుడు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల లెక్కలపై స్పష్టత లేదని, శ్వేతపత్రం తయారీ సమయంలో ఆర్థిక సంక్షోభం లోతు ఎంతో తెలిసిందని, అందువల్లనే కొన్ని స్కీములను అనుకున్నట్లుగా అమలు చేయలేకపోయామని తెలిపారు. ఇప్పటివరకూ లాంచింగ్ కాని స్కీములన్నింటిపై జిల్లాల పర్యటన సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రే ప్రజలకు అర్థం చేయించి వివరణ ఇవ్వనున్నారు. కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల మంజూరు తదితరాల్లో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున అమలుకు నోచుకోని హామీలపైనా ప్రజలకు వివరించే అవకాశమున్నది. విపక్షాల విమర్శలకు ప్రజల్లోకి వెళ్లి ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని వివరించి కన్విన్స్ చేయడమే ఉత్తమమైన మార్గమనే అభిప్రాయం పలువురు మంత్రుల్లోనూ వ్యక్తమవుతున్నది.
హైకోర్టు విచారణ పూర్తయ్యాక..!
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్లకు చట్టబద్ధత లేదని, కేవలం జీవోల ద్వారా అమలు చేస్తున్నారంటూ దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా వీటిపై ఈ నెల 12న హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలపై అప్పీల్‌కు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. స్టే ఎత్తివేయించి.. మళ్లీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. చిన్న స్టేను సాకుగా చూపి బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. హైకోర్టులో ప్రభుత్వం త్వరలోనే అఫిడవిట్ దాఖలు చేయనుంది. అక్కడ విచారణ పూర్తయ్యాక.. ‘అదనంగా రూ. 50వేలు’ అనేదానిపై పూర్తి క్లారిటీ రానుంది.

