ప్రిన్సిపాల్ హత్య కేసులో వీడిన మిస్టరీ..అసలు హంతకులు వీళ్లే!

కలం, నల్గొండ బ్యూరో : నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ నగర్‌లో నాగార్జున ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి (Principal Roopa Reddy) హత్య కేసులో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈనెల 11న తన నివాసంలోనే దారుణంగా హత్యకు గురైన ఈ కేసులో నిందితులు ఆ పాఠశాలలోనే చదువుతున్న పదో తరగతి విద్యార్థులని పోలీసులు గుర్తించారు. డబ్బుల కోసమే ఈ హత్య జరిగినట్లు విచారణలో వెల్లడైంది.

వివరాల్లోకి వెళ్తే, ప్రిన్సిపాల్ రూపారెడ్డి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆమెను కత్తి, బ్లేడుతో 27 సార్లు పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశారు. అనంతరం ఇంట్లోని రూ.2 లక్షల నగదును చోరీ చేసి పరారయ్యారు. నేరం జరిగిన స్థలంలో సిసి కెమెరాలకు చిక్కకుండా, ఎలాంటి ఆనవాళ్లు వదలకుండా నిందితులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. హత్య జరిగిన తర్వాత కూడా ఏమీ తెలియనట్లు వారం రోజుల పాటు క్రమం తప్పకుండా స్కూలుకు వస్తూ ఎవరికీ అనుమానం రాకుండా నడుచుకున్నారు.

ఈ కేసు సవాలుగా మారడంతో నల్గొండ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి దాదాపు 150 మందిని విచారించాయి. పక్కా సమాచారంతో పోలీసులు విచారణ వేగవంతం చేసి నిందితులను పట్టుకున్నారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక సమాచారం. కేసు పూర్వాపరాలను జిల్లా ఎస్పీ త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా వెల్లడించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>