కల్యాణలక్ష్మిపై కుట్రలు చేస్తే ఊరుకోం: నిరంజన్ రెడ్డి

కలం, వనపర్తి: ఆడబిడ్డల ఆర్థిక భరోసా, ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన కల్యాణ లక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్‌ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Niranjan Reddy) హెచ్చరించారు. కాంగ్రెస్‌ కుట్రలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘కదనభేరి’ పేరిట రాజీవ్‌ చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు పేద కుటుంబాలకు అండగా నిలిచాయని నిరంజన్‌రెడ్డి అన్నారు. బాల్యవివాహాలను నిరోధించడంతో పాటు పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ ప్రభుత్వం ఈ పథకాలను ప్రారంభించిందని పేర్కొన్నారు. 2014లో రూ.51,116తో ప్రారంభించి ఆ మొత్తాన్ని రూ.1,00,116కు పెంచినట్లు తెలిపారు. 2014 నుంచి 2023 వరకు సుమారు 13.50 లక్షల మందికి రూ.14 వేల కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లు వివరించారు.

తులం బంగారం హామీ ఏమైంది?

కల్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ హామీని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. పథకాల కొనసాగింపుపై కోర్టు పరిణామాల్లో ప్రభుత్వం స్పందించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. పథకాలను దశలవారీగా నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. 2024–25లో 1.58 లక్షల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చగా, 2025–26లో ఆ సంఖ్య సుమారు 86 వేలకు తగ్గిందని ఆయన పేర్కొన్నారు. పథకాలను యథావిధిగా కొనసాగించడంతో పాటు కేసీఆర్‌ కిట్‌, రైతుబీమా పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

పెంచుతామన్న ఆసరా పింఛన్లు ఏవి?

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఆసరా పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని, దివ్యాంగులకు రూ.6 వేలు, ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు హామీలను అమలు చేయాలని, ఇప్పటివరకు బకాయి ఉన్న మొత్తాన్ని కూడా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ హయాంలో సంక్షేమానికి పెద్దపీట వేశామని, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర వర్గాలకు పింఛన్లు అందించామని తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో సంక్షేమం క్షీణించిందని విమర్శించారు.

సాగునీటి విషయంలోనూ నిర్లక్ష్యం

రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నప్పటికీ తెలంగాణ రైతులకు పూర్తిస్థాయిలో నీరు అందించడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేస్తే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.

నిరసనలకు అనుమతి నిరాకరించడం సరికాదు

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే, నిరసన తెలిపే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉందని నిరంజన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం సరికాదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసే అధికారులను గుర్తుపెట్టుకుంటామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ‘కదనభేరి’ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలకు నిరంజన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్‌, వాకిటి శ్రీధర్‌, నందిమల్ల అశోక్‌, గంధం పరంజ్యోతి, మాణిక్యం, మహిళా సర్పంచులు శోభ, పద్మ, రాజమ్మ, నందిమల్ల శారద, నాగమ్మ, షమీం, పలువురు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>