అర్జున అవార్డుల వేళ: క్రీడా దిగ్గజాలకు కేంద్రం ఘన సత్కారం!

కలం, స్పోర్ట్స్ : కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డులు 2025ను ప్రకటించింది. డెకాథ్లాన్ అథ్లెట్ తేజస్విన్ శంకర్, చెస్ స్టార్ దివ్య దేశ్‌ముఖ్ సహా మొత్తం 17 మంది క్రీడాకారులకు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు(Arjuna Awards )లు దక్కాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఈ అవార్డులను ఖరారు చేసింది. గత నాలుగేళ్లుగా అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఈ పురస్కారాలు అందిస్తున్నారు. కామన్వెల్త్ గేమ్స్ డెకాథ్లాన్ విభాగంలో కాంస్య పతకం సాధించి, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా తేజస్విన్ శంకర్ చరిత్ర సృష్టించారు.

మరోవైపు, ఫిడే మహిళల వరల్డ్ కప్ 2025 గెలిచి, ఆ టైటిల్ సాధించిన మొదటి భారతీయ మహిళగా దివ్య దేశ్‌ముఖ్ రికార్డు నెలకొల్పారు. బాకూలో జరిగిన ఫైనల్లో కోనేరు హంపిని ఓడించి ఆమె ఈ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. అర్జున అవార్డు గ్రహీతల జాబితాలో బ్యాడ్మింటన్ జంట త్రీసా జాలీ – పుల్లెల గాయత్రి గోపీచంద్, చెస్ క్రీడాకారుడు విదిత్ సంతోష్ గుజరాతి, అథ్లెట్లు ముహమ్మద్ అజ్మల్, ప్రియాంక గోస్వామిలతో పాటు బాక్సర్ నరేందర్ ఉన్నారు.

అలాగే ధనుష్ శ్రీకాంత్, లాల్‌రెమ్‌సియామి, రాజ్‌కుమార్ పాల్, సుర్జీత్, పూజ, రుద్రాంష్ ఖండేల్‌వాల్, ఏక్తా భ్యాన్, అరవింద్ సింగ్, అఖిల్ షెయోరాన్ కూడా ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు.1962 ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యుడైన సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఐసయా అరుమై నాయగంను అర్జున లైఫ్‌టైమ్ అవార్డుతో గౌరవించనున్నారు. శిక్షకులకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డులకు అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్, బాక్సింగ్ కోచ్ ఛోటే లాల్ యాదవ్, షూటింగ్ కోచ్ నేహా నంద్ కుమార్ చౌహాన్ ఎంపికయ్యారు.

క్రీడల ప్రోత్సాహంలో కీలక పాత్ర పోషించిన పూణేలోని ‘ఆర్మీ పారాలింపిక్ నోడ్’కు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం దక్కింది.క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా ఈ అవార్డులను అందజేస్తోంది. ఈ పురస్కారాలు దేశంలో క్రీడారంగానికి మరిన్ని సాధించేలా కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>