కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో 16 ఏళ్ల బాలుడు దాదాపు 275 కిలోల బరువుతో ఊబకాయంతో బాధపడుతున్నాడు. శ్వాస ఇబ్బంది, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, చర్మ ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలతో ఢిల్లీలోని (Delhi) గంగా రామ్ ఆస్పత్రిలో చేరాడు. అతడి అధిక బరువు కారణంగా సాధారణ కారులో ప్రయాణించడం కూడా సాధ్యం కాకపోవడంతో మ్యాటడార్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షల్లో అతడికి తీవ్రమైన స్లీప్ అప్నియా ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు శరీరమంతా చర్మ ఇన్ఫెక్షన్ వ్యాపించినట్లు వైద్యులు గుర్తించారు. శ్వాస సంబంధిత ఇతర సమస్యల కారణంగా దాదాపు రెండు వారాల పాటు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందించారు.
బాడీ మాస్ ఇండెక్స్ (BMI) దాదాపు 100కు చేరుకోవడంతో శస్త్రచికిత్సకు ముందు దాదాపు 20 మంది వైద్య నిపుణులతో కూడిన బృందం సమగ్రంగా పరిశీలించింది. పీడియాట్రిక్ క్రిటికల్ కేర్, బారియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ, పీడియాట్రిక్ కార్డియాలజీ, అనస్థీషియా విభాగాల నిపుణులు శస్త్రచికిత్స చేశారు. కుటుంబ సభ్యులతో చర్చించిన ఊబకాయం, దాని వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలను నియంత్రించేందుకు బారియాట్రిక్ సర్జరీ ఉత్తమ మార్గంగా వైద్య బృందం నిర్ణయించింది. అనంతరం డాక్టర్ దక్ష్ సేథి, డాక్టర్ సుధీర్ కల్హాన్, డాక్టర్ ముకుంద్ ఖేతన్, డాక్టర్ సువిరాజ్ జాన్ నేతృత్వంలో ల్యాపరోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీని విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా లీడ్ బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ దక్ష్ సేథి మాట్లాడుతూ.. ఇది సాధారణ బారియాట్రిక్ శస్త్రచికిత్స కాదని, బాలుడి వయస్సు, అధిక బరువు, తీవ్రమైన స్లీప్ అప్నియా కారణంగా ప్రతి దశను జాగ్రత్తగా ప్రణాళిక చేయాల్సి వచ్చిందన్నారు. శస్త్రచికిత్సకు ముందు బాలుడిని ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని విభాగాల నిపుణులతో బృందాన్ని సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.

