కలం, మహబూబ్ నగర్ బ్యూరో: విద్యార్థులను చిన్ననాటి నుంచే సరైన మార్గంలో నడిపించి, ఉన్నత లక్ష్యాలను సాధించేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) అన్నారు. మహబూబ్నగర్ నగరంలోని సరస్వతి విద్యాపీఠం (Saraswathi Vidyapeetham) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి విద్యార్థుల క్రీడా పోటీల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు ప్రదానం చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు ఈ క్రీడా పోటీలకు హాజరు కావడం అభినందనీయమన్నారు.
8వ, 9వ, 10వ తరగతుల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని, ఈ వయసులోనే వారికి సరైన దిశానిర్దేశం, ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యతరగతి, పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులను సరైన విధంగా తీర్చిదిద్దితే వారు వజ్రాల్లా మెరిసి సమాజానికి, దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదుగుతారని తెలిపారు. మారుతున్న ప్రపంచం, పెరుగుతున్న పోటీకి అనుగుణంగా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో కోట్లాది రూపాయలతో భవనాలు, ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ, విద్యార్థుల్లో పట్టుదల, క్రమశిక్షణ, ఏకాగ్రత, సృజనాత్మకతను పెంపొందించడం మరింత ముఖ్యమని పేర్కొన్నారు.
సరస్వతి విద్యాపీఠం విద్యార్థులకు విద్యతో పాటు దేశభక్తి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, క్రమశిక్షణ, నైతిక విలువలను నేర్పడం అభినందనీయమన్నారు. తన కుటుంబంలో కూడా తన అన్నసరస్వతి శిశు మందిరంలో చదువుకున్నారని, ఆ సంస్థలో నేర్పించే విలువలు, క్రమశిక్షణను తాను ప్రత్యక్షంగా చూశానని ఆయన తెలిపారు. సరస్వతి విద్యాపీఠంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పరిమిత వేతనాలు, సౌకర్యాలు ఉన్నప్పటికీ ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నారని అభినందించారు. పిల్లలకు పాఠాలు చెప్పడం మాత్రమే కాకుండా, దేశానికి మంచి పౌరులను అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమన్నారు.
చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. రన్నింగ్, షటిల్ తదితర క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, ఏకాగ్రత, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను పెంపొందిస్తాయని తెలిపారు. పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఉన్న ఆటలపై ఆసక్తిని గుర్తించి, పాఠశాల స్థాయిలో వారిలోని ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాలని అన్నారు. క్రీడల ద్వారా పొందే ఏకాగ్రత, క్రమశిక్షణ భవిష్యత్తులో ఎంత కష్టమైన చదువునైనా నేర్చుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. పాఠశాలల్లో యోగా వంటి కార్యక్రమాలను నిర్వహించడం కూడా విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమన్నారు.
విద్య, క్రీడలు, యోగా, క్రమశిక్షణతో విద్యార్థుల సమగ్ర వికాసానికి కృషి చేయాలని సూచించారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులను తీసుకొచ్చి వారిలో ఉత్సాహం, క్రీడాస్ఫూర్తి నింపుతున్న నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. దూర ప్రాంతాల నుంచి విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చిన బస్సు డ్రైవర్లు, సహాయక సిబ్బంది, విద్యార్థుల భద్రత, సౌకర్యాల కోసం పనిచేస్తున్న శిక్షకులు, పర్యవేక్షకులు, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
సరస్వతి విద్యాపీఠం మరింత అభివృద్ధి చెంది, దేశానికి సేవ చేసే లక్షలాది మంది మంచి పౌరులను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటున్న ప్రతి విద్యార్థి ప్రతిభను చాటుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని యెన్నం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, అతిథులు తిరుపతిరావు, దక్షిణ భారతదేశ క్షేత్ర సంఘటనకర్త లింగం సుదామరెడ్డి, సరస్వతి విద్యాపీఠం బ్రాంచ్ సంఘటన కార్యదర్శి శ్రీనివాసరావు, దేవేంద్ర రాజు, ఎల్లప్ప, పుల్లా యుగేందర్ రెడ్డి, రాంరెడ్డి, గంగాధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

