కలం, నిర్మల్: సామాజిక సమానత్వం, ప్రజా సంక్షేమం కోసం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ (Sardar Sarvai Papanna Goud) చేసిన పోరాటం చిరస్మరణీయమని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti) అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితాంతం పోరాడారని అన్నారు. సామాన్య ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని పేర్కొన్నారు.
గోల్కొండ కోటపై తన సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప యోధుడిగా పాపన్నగౌడ్ చరిత్రలో నిలిచిపోయారని మహేశ్వర్ రెడ్డి కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటం, చూపిన ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. సామాజిక సమానత్వం, ప్రజా సంక్షేమం కోసం పాపన్నగౌడ్ పాటుపడిన విధానం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.

