కలం, మహబూబ్ నగర్ బ్యూరో: సర్వాయి పాపన్న గౌడ్ (Sarvai Papanna Goud) జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ నగరంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్‌లో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy), మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ తదితరులు పాల్గొని సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం కృషి చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. అణగారిన వర్గాలకు సమాన హక్కులు, ఆత్మగౌరవం కల్పించాలనే లక్ష్యంతో ఆయన సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ధైర్యసాహసాలు, ప్రజల కోసం చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. బహుజన రాజ్యాధికార సాధన కోసం పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన ధీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. ఆయన ధైర్యసాహసాలు, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, సీజే బెనహర్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

