ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది.. కాంగ్రెస్‌పై మాజీ మంత్రి ఫైర్!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అబద్ధపు మాటలతో అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని బిఆర్ఎస్ మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ (V. Srinivas Goud) ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ (Mahabubnagar) పట్టణంలోని తెలంగాణ కూడలిలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ నిరసన (BRS Protest) కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగిందన్నారు. పేదింటి ఆడపిల్ల పెండ్లికి ఆసరాగా ఉండాలని కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేస్తే వాటిని తొలగించాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని ఆయన ఆరోపించారు. మహిళలపై వేధింపులు, అత్యాచారాలు జరిగితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కఠిన శిక్షలు తీసుకున్నారని గుర్తుచేశారు. బాలికలు చదువుకునేందుకు గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేశామని అన్నారు.

కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్హతను బట్టి పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ నమ్మి ప్రజలు ఓటు వేసి మోసపోయారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కిట్ పథకంను ప్రభుత్వం నిలిపి వేసిందనీ, చనిపోయిన రైతులకు బీమా రాకుండా ప్రీమియం కట్టలేదనీ, రైతు చనిపోతే కుటుంబం రోడ్డును పడే దుర్భర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం అమలు చేయకూడదని కోర్టు కేసు సాకుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు వెళ్లడంలో నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు.

బీఆర్ఎస్ పోరాటంతో దిగి వచ్చి ఓ మంత్రి దీనిపై స్పందించి వెంటనే న్యాయ పరంగా ముందుకు వెళ్తామని చెప్పడం చూస్తుంటే వీరికి పాలనపై ఏ మాత్రం పట్టు ఉందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ యధావిధిగా కొనసాగించడంతో పాటు తులం బంగారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలకు పెంచిన పెన్షన్ ఇవ్వాలని, విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని, ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వాలని, కేసీఆర్ కిట్, రైతు భీమా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

రెండు లక్షల ఉద్యోగులు ఏమైనాయో యువతకు చెప్పాలన్నారు. పథకాలు రద్దు చేస్తే ప్రజలు తిరగబడుతారనీ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తమ హయాంలో మహబూబ్ నగర్ నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామనీ, ప్రతి రోజు నీళ్లు ఇచ్చేందుకు ట్యాంకులు, ఇంటి ముందు నల్లాలు ఏర్పాటు చేశామని, ఇప్పుడు కనీసం తాగే నీళ్లను శుద్ధి చేయడం లేదన్నారు.ప్రజలు జాగృతం అయి పోరాటం చేయకుంటే పెన్షన్, ఇతర పథకాలు కూడా నిలిపి వేసే ప్రమాదం ఉందనీ ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న , మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పట్టణ అధ్యక్షులు శివరాజ్, మహబూబ్ నగర్ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, హన్వాడ మండల అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెహమాన్, ఆంజనేయులు, సీనియర్ నాయకులు నరేందర్, లక్ష్మయ్య, గణేష్, రవికిషన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఖలీమ్, నరేందర్, శ్రీను నాయక్, సిద్దికీ, జహంగీర్, శ్రీశైలము, కార్పొరేటర్లు జ్యోతి, లక్ష్మి, కుర్వ సత్యం, హైన్దవి, మీరా బాయి, మధుమోహన్, నవకాంత్, ఈశ్వరయ్య, శరత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>