కలం, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) కు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులో కోర్టు శిక్ష విధించింది. సిడ్నీ కోర్టు ఆయనకు 1,500 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా వేసింది. మళ్లీ కారు నడపాలంటే ఇంటర్‌లాక్ పరికరం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. ఈ కేసులో వార్నర్ గత నెలలోనే నేరాన్ని అంగీకరించారు. ఈ ఘటన ఏప్రిల్ 5వ తేదీన ఈస్టర్ ఆదివారం జరిగింది. ర్యాండమ్ బ్రీత్ టెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆయన తొలుత ఆపాల్సిన ప్రదేశానికి కొద్దిగా దూరంలో కారు ఆపారు.
ఆ తర్వాత కారులో ఉన్న మహిళా ప్రయాణికురాలితో సీట్లు మార్చుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వార్నర్‌నే డ్రైవర్‌గా గుర్తించారు. అనంతరం ఆయన పరీక్షకు సహకరించారు. పరీక్షలో అనుమతించిన పరిమితికి రెండింతలకుపైగా ఆల్కహాల్ ఉన్నట్లు తేలింది. ఈ కేసు ప్రభావం సిడ్నీ థండర్ కెప్టెన్సీపైనా పడే అవకాశం కనిపిస్తోంది. రాబోయే బిగ్ బాష్ లీగ్ సీజన్‌కు ఆయన కెప్టెన్‌గా కొనసాగుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వార్నర్ తరఫు న్యాయవాది అవైస్ అహ్మద్ మాత్రం శిక్ష విధించకుండా ఉండాలని కోర్టును కోరారు. ఈ ఘటనతో ఇప్పటికే వార్నర్‌కు తీవ్ర పరిణామాలు ఎదురయ్యాయని తెలిపారు. అంతర్జాతీయ మీడియా సంస్థల్లో విస్తృతంగా వార్తలు రావడం, వాణిజ్య అవకాశాలపై ప్రభావం పడటం వంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే న్యాయమూర్తి క్లేర్ ఫర్నన్ మాత్రం డ్రంక్ డ్రైవింగ్‌ను నిరోధించడం ముఖ్యమని స్పష్టం చేశారు.
ఘటన సమయంలో కారులో పిల్లలు కూడా ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. వార్నర్ మళ్లీ డ్రైవింగ్ చేయాలంటే ఇంటర్‌లాక్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలి. కారులో పరికరాన్ని అమర్చుకోవాలి. డ్రైవర్ శరీరంలో ఆల్కహాల్ ఉన్నట్లు పరికరం గుర్తిస్తే కారు స్టార్ట్ కాకుండా ఇది అడ్డుకుంటుంది. క్రికెట్ ఎన్ఎస్డబ్ల్యూ కూడా ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఆటగాళ్లకు సురక్షిత డ్రైవింగ్‌పై అవగాహన కల్పించడం కొనసాగిస్తామని పేర్కొంది.

