కలం, స్పోర్ట్స్ : భారత్‌లో అత్యున్నత క్రీడా పురస్కారంగా భావించే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు (Khel Ratna Award) 2025 సంవత్సరానికి ఒక్క క్రీడాకారుడి పేరును కూడా ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. 1991-92లో ఈ అవార్డును ప్రారంభించిన తర్వాత ఇలా జరగడం ఇది మూడోసారి. గతంలో 2008, 2014 సంవత్సరాలలో కూడా ఖేల్ రత్న అవార్డును ఎవరికీ ప్రదానం చేయలేదు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని జాతీయ క్రీడా పురస్కారాల ఎంపిక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కమిటీ సిఫారసులను కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయకు పంపగా, మంగళవారం క్రీడల మంత్రిత్వ శాఖ 2025 జాతీయ క్రీడా పురస్కారాలను అధికారికంగా ప్రకటించింది.
ఈసారి ఖేల్ రత్న (Khel Ratna Award) కోసం పలువురు ప్రముఖ క్రీడాకారుల పేర్లు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రపంచ స్థాయి ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం, మహిళల క్రికెట్ ప్రపంచకప్ విజేత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పేర్లు బలంగా వినిపించాయి. అయితే తుది జాబితాలో వారి పేర్లు చోటు చేసుకోలేదు. క్రికెట్‌కు సంబంధించి ప్రదర్శనలను అంచనా వేయడానికి ప్రత్యేక పాయింట్ల విధానం లేకపోవడం కూడా ఈ నిర్ణయంలో ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. చివరిసారిగా 2023లో భారత పేసర్ మహ్మద్ షమీ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు.
ఇదిలా ఉండగా, 2025 సంవత్సరానికి 17 మంది క్రీడాకారులను అర్జున అవార్డులకు (Arjuna Awards) ఎంపిక చేశారు. అథ్లెటిక్స్ విభాగంలో తేజస్విన్ శంకర్, మహమ్మద్ అజ్మల్ వి, ప్రియాంక గోస్వామి అవార్డు గ్రహీతలుగా నిలిచారు. బ్యాడ్మింటన్‌లో ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపిచంద్ ఎంపికయ్యారు. బాక్సింగ్‌లో నరేందర్, చెస్‌లో విదిత్ సంతోష్ గుజరాతీ, దివ్య జితేంద్ర దేశ్‌ముఖ్ అవార్డులు అందుకోనున్నారు. ఫిడే మహిళల ప్రపంచకప్‌ను గెలుచుకున్న తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్‌కు అర్జున అవార్డు దక్కడం విశేషం.
హాకీలో లాల్రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్, కబడ్డీలో సుర్జీత్, పూజా కూడా ఈ జాబితాలో చోటు సంపాదించారు. అదేవిధంగా పారా షూటింగ్‌లో రుద్రాంశ్ ఖండేల్వాల్, పారా అథ్లెటిక్స్‌లో ఏక్తా భ్యాన్, రోయింగ్‌లో అరవింద్ సింగ్, షూటింగ్‌లో అఖిల్ షియోరాన్ అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఐ. అరుమైనాయగంకు జీవితకాల విభాగంలో అర్జున అవార్డు ప్రకటించారు.ద్రోణాచార్య అవార్డుల సాధారణ విభాగంలో అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్, బాక్సింగ్ కోచ్ ఛోటే లాల్ యాదవ్, షూటింగ్ కోచ్ నేహా నందకుమార్ చవాన్ ఎంపికయ్యారు. జీవితకాల విభాగంలో బాక్సింగ్ కోచ్ ధర్మేంద్ర సింగ్ యాదవ్, రెజ్లింగ్ కోచ్ వీరేంద్ర కుమార్ అవార్డులు అందుకోనున్నారు. క్రీడల అభివృద్ధి, ప్రోత్సాహంలో విశేష సేవలు అందించిన సంస్థలకు ఇచ్చే రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం ఈసారి పుణేలోని ఆర్మీ పారాలింపిక్ నోడ్‌కు దక్కింది.
Also Read : తొలి రౌండ్‌లో ఘనవిజయం.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఉన్నతి
Follow Us On : WhatsApp

