వృద్ధుల్లో జ్ఞాపకశక్తి క్షీణత.. అసలు కారణం అదేనా?

కలం, తెలంగాణ బ్యూరో: వృద్ధుల్లో జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం తగ్గడానికి సహజంగా కలిగే వయోభారం అనుకుంటారు. కానీ, అసలు వాస్తవం మరొకటి ఉంటుందని తాజాగా తేలింది. హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ICMR-NIN) పరిశోధకులు 55 నుంచి 85 ఏళ్ల మధ్య వయసున్న 184 మంది వృద్ధులపై స్టడీ నిర్వహించారు. ఆ నివేదిక అంతర్జాతీయ జర్నల్ ‘న్యూట్రియెంట్స్’లో పబ్లిష్ అయింది. దీనిలో పోహకాహార లోపం కూడా వృద్ధుల్లో జ్ఞాపకశక్తి తగ్గేందుకు ప్రధాన కారణమని తేల్చి చెప్పారు.

ఆ మూడింటి మధ్య సంబంధం…

పరిశోధనలో భాగంగా రక్తంలోని కొన్ని విటమిన్ల స్థాయిలు, న్యూరోనల్ బయోమార్కర్లు, తేలికపాటి జ్ఞాపకశక్తి లోపం మధ్య ముఖ్యమైన సంబంధాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వృద్ధుల్లో విటమిన్ A, D, B1, B2, B6, B9, B12 స్థాయిలతో పాటు బీటా-అమైలాయిడ్, టోటల్ టౌ, న్యూరోఫిలమెంట్ లైట్ చైన్, బ్రెయిన్ డెరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ వంటి న్యూరోనల్ బయోమార్కర్లను పరిశీలించారు. అలాగే వారి రక్తపోటు, చక్కెర స్థాయిలు, శరీర కొలతలు, ఇతర బయోకెమికల్ అంశాలను కూడా విశ్లేషించారు.

36.4 శాతం మందికి అదే లోపం..

అధ్యయనం చేసిన వృద్ధుల్లో 36.4 శాతం మందికి తేలికపాటి జ్ఞాపకశక్తి లోపం (MCI) ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సాధారణ వృద్ధాప్యం, డిమెన్షియా మధ్య దశని వైద్య పరిభాషలో ఎంసీఐగా పరిగణిస్తారు. ఈ దశలో జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యంలో కొంత మార్పు కనిపించినా.. రోజువారీ పనులను వ్యక్తులు సొంతంగానే చేసుకోగలుగుతారు. తేలికపాటి జ్ఞాపకశక్తి లోపం ఉన్నవారిలో విటమిన్ D, B1, B2, B6, B9, B12 వంటి సూక్ష్మ పోషకాల రక్తస్థాయిలు తక్కువగా ఉన్నాయి. విటమిన్ D, B2, B9 లోపాలతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు, సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ తేలికపాటి జ్ఞాపకశక్తి లోపం ఉన్న వారిలో ఎక్కువగా కనిపించాయి. అదే సమయంలో విటమిన్ D, B6 స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో మెరుగైన కాగ్నిటివ్ పనితీరు కనిపించినట్లు పరిశోధకులు వెల్లడించారు.

లోతైన పరిశోధనలతోనే…

పరిశోధనకు నాయకత్వం వహించిన బయోకెమిస్ట్రీ విభాగం హెడ్ డాక్టర్ జి.భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. విటమిన్లు జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతున్నా.. విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం వలనే తేలికపాటి జ్ఞాపకశక్తి లోపం తప్పనిసరిగా తగ్గుతుందని ఈ అధ్యయనం ఇంకా నిర్ధారించలేదని స్పష్టం చేశారు. మరింత లోతుగా అధ్యయనం చేయడంతో పాటు రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్ అవసరమని తెలిపారు.

ICMR-NIN డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి మాట్లాడుతూ… ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి వ్యాధుల నియంత్రణతో పాటు పోషకాహారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. శరీరానికి సూక్ష్మ పోషకాలు అందేలా చూడటం వలన కాగ్నిటివ్ ఆరోగ్యానికి దోహదపడుతుందని తెలిపారు. అయితే, వృద్ధుల్లో పోషకాహార స్థితిని ముందుగానే అంచనా వేయడం, అవసరమైన సమయంలో చర్యలు తీసుకోవడం ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ఉపయోగపడుతుందని మాత్రం పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>