కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా ఎరువుల కోసం (Urea Shortage) రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంటలకు సమయానికి యూరియా వేయాల్సి ఉండటంతో, బుధవారం ఉదయం 6 గంటల నుంచే రైతులు పెద్ద ఎత్తున దుకాణం వద్దకు చేరుకున్నారు. గంటల తరబడి నిలబడలేక, లైనులో తమ స్థానం కోల్పోకుండా ఉండటానికి చెప్పులను వరుసలో పెట్టి గంటల తరబడి నిరీక్షించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకుని సుమారు 24 గంటలు కావస్తున్నా, ఇప్పటివరకు తమకు స్టాక్ అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్ విధానం వల్ల సమయం వృథా కావడమే తప్ప ఎరువులు వేగంగా అందడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పెద్దఎత్తున రావడంతో, ఎటువంటి తోపులాటలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులను రంగంలోకి దించారు. పోలీసు పహారా నడుమ అధికారులు యూరియా బస్తాల పంపిణీ చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సరిపడా యూరియా స్టాక్‌ను అందుబాటులో ఉంచి, రైతుల కష్టాలను తీర్చాలని స్థానిక రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

