కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma) పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆమె మెడలో కాషాయ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆమెను పరిచయం చేయించారు. యువత రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఢీ షోలో డ్యాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఆమె.. పలు సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా పనిచేసి ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయడం కూడా ఇండస్ట్రీలో చర్చకు దారి తీస్తోంది.
బుల్లి తెరపై సంచలనం..
యూపీలోని ఇటావాకు చెందిన శ్రష్టి వర్మ (Shrasti Verma) చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే ఎంతో ఆసక్తి చూపించేవారు. ఢీ డ్యాన్స్ షోలో రిజిస్టర్ చేసుకుని కో–డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఉంటూ పలు సినిమాల్లో పనిచేశారు. అయితే ఆమెకు ఎక్కువ పేరు తీసుకొచ్చిన మూవీ మాత్రం పుష్ప–2. ఇందులో సూసేకీ.. అనే పాటను కొరియోగ్రాఫ్ చేయడంతో శ్రష్టి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. స్టార్ హీరోల చిత్రాల్లో డ్యాన్స్ కంపోజ్ చేసి మంచి గుర్తింపు పొందారు. అదే సమయంలో బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుని, కంటెస్టెంట్‌గా బుల్లి తెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
జానీ మాస్టర్ వివాదంతో..
శ్రష్టి వర్మ కెరీర్ సాఫీగా సాగిపోతున్న క్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఆమె చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. ఆయనపై కేసు నమోదు కావడం, జైలుకు వెళ్లడంతో సంచలనంగా మారింది. ఇటీవల డ్యాన్స్ అసోసియేషన్ ఎన్నికల్లోనూ ఆమె కీలకంగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె రాజకీయాల వైపు దృష్టి పెట్టడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Also Read : అనిరుధ్, కావ్యామారన్ పెళ్లి డేట్ ఫిక్స్..!
Follow Us On: Instagram

