ఫూలే, అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి: మల్లు రవి, యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మహబూబ్‌నగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్‌లో మహాత్మా జ్యోతిరావు ఫూలే , డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ (Phule and Ambedkar Statues) సోమవారం ఘనంగా జరిగింది. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి (Mallu Ravi), ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహాలను ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి (Mallu Ravi) మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామి కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వంటి మహానీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వారి అడుగుజాడల్లో పయనిస్తూ సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని అన్నారు.

వారి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి..

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ముఖ్యంగా విద్యార్థులు చదువును జీవితంలో ప్రధాన లక్ష్యంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహానీయులు తమ జీవితాలను అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని, విద్య, జ్ఞానం ద్వారానే సమాజంలో నిజమైన మార్పు తీసుకురావచ్చని విశ్వసించారని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడే రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వాతంత్య్రాన్ని సంపూర్ణంగా సాధించగలరని తెలిపారు.

ఇది ప్రభుత్వ బాధ్యత కాదు.. సామాజిక బాధ్యత

పేద, అణగారిన వర్గాలకు చెందిన పిల్లలకు విద్య అందించడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. “మన పిల్లలకు సరైన సాన్నిధ్యం, ప్రోత్సాహం, విద్య అందిస్తే వారు వజ్రాలుగా మారుతారు. లేకపోతే వారి ప్రతిభ మట్టిలో కలిసిపోయే ప్రమాదం ఉంది” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యలో ముందుకు వెళ్లేలా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ప్రతి సమావేశంలోనూ ప్రజా సమస్యలతో పాటు పిల్లల చదువు, వారి భవిష్యత్తు, విద్యా అవకాశాలపై కూడా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

విద్యారంగ అభివృద్ధికి పెద్దపీట..

మహబూబ్‌నగర్ నగరంలో విద్యారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వ విప్ తెలిపారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో అనేక విద్యా సంస్థలను తీసుకొస్తున్నామని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో ట్రిపుల్ ఐటీ, ఇంజనీరింగ్ కళాశాల, లా కళాశాల వంటి ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ విద్యా సంస్థల ద్వారా ముఖ్యంగా పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని అన్నారు. ట్రిపుల్ ఐటీలో మహబూబ్‌నగర్ విద్యార్థులకు గణనీయమైన సంఖ్యలో సీట్లు సాధించుకున్నామని అన్నారు. వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు.

ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అంబేడ్కర్, ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు రాబోయే ఐదు సంవత్సరాలను విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేయాలని ప్రభుత్వ విప్ పిలుపునిచ్చారు. “మన పిల్లలకు జ్ఞానం అందించాలి. వారికి సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలి. వారు ఉన్నత విద్యను అభ్యసించి దేశంలోనే అత్యున్నత స్థానాలకు చేరేలా చేయాలి. ఇదే మహానీయుల ఆశయాలకు మనం ఇచ్చే నిజమైన గౌరవం” అని అన్నారు.

వారి సమస్యలు పరిష్కరించాలి..

పిల్లలకు పుస్తకాలు అందించడం, విద్యా సహాయం చేయడం, కౌన్సెలింగ్ ఇవ్వడం, ఉన్నత విద్యా అవకాశాలపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర అణగారిన వర్గాలకు సంబంధించిన సమస్యలు ఎక్కడ ఎదురైనా వాటిని గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు. సమస్యలను కేవలం చర్చించడం కాకుండా వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం అవసరమని తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎదురవుతున్న సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను సూచించే సంస్థలు మరింత చురుకుగా పనిచేయాలని ఆకాంక్షించారు.

ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి..

మహానీయులు చూపించిన సామాజిక చైతన్యం, పోరాట పటిమ, సమస్యలను అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను చూపించే దృక్పథం ప్రతి ఒక్కరిలోనూ పెంపొందాలని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా వారి స్ఫూర్తిని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఏర్పడిందని అన్నారు. వారి విగ్రహాలకు పూలమాలలు వేయడంతో కార్యక్రమం ముగిసిపోకూడదని, వారి ఆశయాలను మన జీవితాల్లో ఆచరణలో పెట్టినప్పుడే వారికి నిజమైన నివాళి లభిస్తుందని అన్నారు. ప్రతి కుటుంబం తమ పిల్లలను చదివించాలని, ప్రతి విద్యార్థి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని, ప్రతి ఉద్యోగి తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

అప్పుడే సమాజం బలపడుతుంది..

విద్యార్థుల భవిష్యత్తును బలంగా నిర్మించగలిగితేనే సమాజం బలపడుతుందని, సమాజం బలపడితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఫూలే చూపిన విద్యా మార్గం, అంబేడ్కర్ చూపిన రాజ్యాంగ మార్గం మనందరికీ శాశ్వత మార్గదర్శకాలని, ఆ మార్గంలో నడుస్తూ పేద, అణగారిన వర్గాల పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడమే మన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, వినోద్ కుమార్, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్,సిరాజ్ ఖాద్రీ, సాయిబాబా, చీఫ్ ఇంజనీర్ బాలస్వామి, ఎస్‌ఈ భీమా నాయక్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Also Read : నిషేధిత భూములపై పొంగులేటి కీలక ప్రకటన

Follow Us On : WhatsApp

మహబూబ్ నగర్ వార్తల కోసం క్లిక్ చేయండి

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>