బకాయిలు చెల్లించని మిల్లర్లపై కేసులు: సుదర్శన్ రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రభుత్వానికి బకాయిలు చెల్లించని రైస్ మిల్లర్లకు నోటీసులు జారీ చేసి, రెవెన్యూ రికవరీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి (P Sudarshan Reddy) ఆదేశించారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి వివిధ శాఖల పనితీరుపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఇప్పటివరకు ఎంత మంది రైస్ మిల్లర్ల నుంచి బకాయిలు వసూళ్లు చేశారు.. ఎంత మంది సీ.ఎం.ఆర్‌కు బకాయిలు చెల్లించేందుకు సముఖంగా ఉన్నారనే వివరాలను సుదర్శన్ రెడ్డి ఆరా తీశారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలను వేగంగా చేపట్టాలని సూచించారు. తాగునీరు, టాయిలెట్స్ వంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. వంద శాతం పనులు నాణ్యతతో జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని సూచించారు.

నిధులు మంజూరు చేస్తాం..

పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. మూత్రశాలల నిర్మాణాలు, మరమ్మతుల కోసం వీబీజీరాంజీ పథకం కింద ప్రతిపాదనలు పంపాలన్నారు. నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపాలన్నారు. విద్యార్థులకు వారం రోజుల్లోపు ఏకరూప దుస్తులు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా యూనిఫాంలను వేగవంతంగా కుట్టించాలన్నారు.

అవసరమైతే కార్యదర్శులపై చర్యలు..

పంచాయతీ రాజ్ శాఖ పనితీరుపై సుదర్శన్ రెడ్డి సమీక్షించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్యం పనులు, తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా రోజువారీగా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే పంచాయతీ కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోనూ చెత్తను వెనువెంటనే తరలించేలా డంపింగ్ యార్డ్ మల్టీపుల్ పాయింట్స్ ఏర్పాటు చేయాలని కమిషనర్ దిలీప్ కుమార్‌కు సూచించారు. సమీక్షా సమావేశంలో జడ్పీ సీఈవో సాయ గౌడ్, డీఆర్డీవో సాయన్న, డీ.ఎస్.ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, డీఈవో పి.అశోక్, డీపీవో శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.

Also Read : గాంధీభవన్‌లో సామాజిక వర్గాల రగడ… క్రమ‘శిక్ష’ణలో వివక్ష!

Follow Us On: X(Twitter)

నిజామాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>