పాలమూరు అభివృద్ధిలో రాజకీయాలు ఉండకూడదు: యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్‌లో అభివృద్ధి ఉండాలి తప్ప.. రాజకీయాలు ఉండకూడదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) ఆకాంక్షించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రముఖ ఎక్సైజ్ కాంట్రాక్టర్ వాల్దాస్ ప్రతాప్ గౌడ్ మిత్ర బృందం, వివిధ పార్టీలకు చెందిన సుమారు 2 వేల మంది నాయకులు, కార్యకర్తలు హైటెక్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సోమవారం యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ప్రజలకు మంచి జరగాలనే రాజకీయాల్లో ఉన్నాం..

ఈ సందర్భంగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరేలా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ గౌరవంతో స్వాగతిస్తున్నామని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి జరగాలనే ఆలోచనతో రాజకీయాల్లో ఉన్నామని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర పార్టీలకు చెందిన వారిని కాంగ్రెస్‌లోకి తీసుకురావాలనే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం, యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడం, విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గ్రామగ్రామాన బలోపేతం చేయడంలో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

ప్రతిఒక్కరూ పనిచేయాలి..

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని అన్నారు. ఇప్పటికే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన పలువురు అభ్యర్థులు విజయం సాధించారని, రాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు సంబంధించిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లే విజయం సాధించడం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.

ప్రజల పక్షాన నిలబడి, ప్రజలకు మేలు చేసే విధానాలను అమలు చేస్తున్నందుకే కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం లభిస్తోందని తెలిపారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్న నాయకులు, వివిధ రంగాల్లో ప్రజాసేవ చేస్తున్న ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని చెప్పారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతాప్ గౌడ్, బాగన్న గౌడ్, జగన్మోహన్ గౌడ్ తదితరుల సేవలను అభినందించారు. వారి కుటుంబాలతో గతంలో ఉన్న పరిచయాలను ఆయన గుర్తుచేసుకుంటూ, ప్రజాసేవ పట్ల వారికి ఉన్న నిబద్ధతను కొనియాడారు. బాగన్న గౌడ్ వంటి నాయకులు యువతకు మార్గదర్శకంగా నిలుస్తూ, మన సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సమాజంలో మంచి విలువలను పెంపొందించేందుకు, పిల్లలకు మెరుగైన భవిష్యత్తు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

ఇదే నిజమైన రాజకీయం..

రాజకీయాలంటే కేవలం పదవులు, అధికారమే కాదని.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయమని నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, విద్యుత్, పాఠశాలలు, వైద్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు వంటి మౌలిక అవసరాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రజాప్రతినిధుల అసలు బాధ్యత అని అన్నారు. పిల్లలకు మంచి విద్య అందించి, వారు ఇంజనీర్లు, డాక్టర్లు, ఉన్నతస్థాయి ఉద్యోగులు, నిపుణులుగా ఎదిగేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించినప్పుడే రాజకీయాలకు నిజమైన అర్థం ఉంటుందని తెలిపారు. ప్రజల వ్యాపారాలు, ఉపాధి, స్థానిక సమస్యలు, యువత భవిష్యత్తు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి కుటుంబానికి చేరేలా..

ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలను ప్రతి కుటుంబానికి చేరేలా చేయాలని కార్యకర్తలకు సూచించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే వంటి మహనీయులు చూపిన సామాజిక న్యాయం, సమానత్వం, విద్య, సాధికారత మార్గంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. వెనుకబడిన వర్గాలు, పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, యువతకు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓర్పుతో, క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. పార్టీపై విశ్వాసంతో ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో అవకాశాలు లభిస్తాయని, అయితే పదవుల కోసం కాకుండా ప్రజాసేవను ప్రధాన లక్ష్యంగా చేసుకుని పనిచేయాలని సూచించారు.

పార్టీని బలోపేతం చేయాలి..

పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు పార్టీ తరపున, ముఖ్యమంత్రి తరపున ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, ఎన్ పీ వెంకటేష్, సిరాజ్ ఖాద్రీ, సిజే బెనహర్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్, గొర్రెల కాపరులు సహకార సంఘం చైర్మన్ శాంతన్న యాదవ్, నాయకులు మైత్రి యాదయ్య, ఓబీసీ సెల్ చైర్మన్ రాజు గౌడ్, ఎస్సీ సెల్ చైర్మన్ బాలయ్య, నగర కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>