కలం, వెబ్ డెస్క్: సాధారంగా భక్తులు తమ కోరికలు నెరవేరేందుకు దేవుడికి ముడుపులు కడతారు, ప్రత్యేక పూజలు చేస్తారు, లేదా కొన్ని ఆలయాలలో గిరి ప్రదక్షిణలు చేస్తుంటారు. కానీ, ఒక ప్రత్యేక ఆలయంలో మాత్రం తాళం వేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు బలంగా నమ్ముతారు. ఈ వింత సంప్రదాయం కలిగిన ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా?
ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయం ప్రకారం భారతదేశంలోని ఆలయాలలో కొన్ని ఆలయాలు ప్రత్యేకమైన సంప్రదాయాలు కలిగి ఉంటాయి. ఆ సంప్రదాయాలు, విశ్వాసాల కారణంగానే అవి ఎంతో ప్రసిద్ధి చెందుతాయి. అలాంటి ప్రత్యేక సంప్రదాయం కలిగిన ఆలయమే ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ప్రయాగ్ రాజ్, ముట్టీగంజ్ ప్రాంతంలో ఉన్న శ్రీ నాథేశ్వర్‌నాథ్ మహాదేవ్ ఆలయం. దీనినే నాథేశ్వర్ నాథ్ (Natheshwar Nath Temple) ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయం భక్తులచే తాళాల ఆలయంగా పిలవబడుతోంది.
500 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని భక్తులు ప్రేమగా ‘తాళం వేసి మహాదేవ్ ఆలయం’ అని పిలుస్తారు. అయితే ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ మనసులోని కోరికలను కోరుకుంటూ, ఒక కొత్త తాళాన్ని తెచ్చి ఆలయ ప్రాంగణంలోని ఇనుప కంచెకు లేదా గోడలకు వేస్తారు. ఆ తాళం చెవిని జాగ్రత్తగా తమతో పాటు తీసుకెళ్తారు. ఇలా చేయడం వల్ల భోళాశంకరుడు తమ ప్రార్థనలను ఆలకించి, కోరికను నెరవేరుస్తాడని వారు బలంగా విశ్వసిస్తారు.
అయితే కోరిక నెరవేరిన తర్వాత, వారు తిరిగి ఆలయానికి చేరుకుంటారు. తాము గతంలో వేసిన తాళాన్ని వెతికి, తమ వద్ద ఉన్న తాళం చెవితో తాళాన్ని తెరుస్తారు. అనంతరం బోళానాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. అయితే ఆలయంలో ఇలా కొన్ని వందల మంది భక్తులు తాళాలు వేస్తుంటారు.
కాబట్టి తమ తాళాన్ని సులభంగా గుర్తించేందుకు భక్తులు మార్కర్ తో తాళంపై తమ పేరు, ఊరు, ఫోన్ నెంబర్ రాస్తుంటారు. ఈ సంప్రదాయం ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతుందని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడి ఆలయ గోడలు, కంచెలు, పరిసర ప్రాంతాల్లో కనిపించే ఒక్కో తాళం వెనుక ఒక్కో భక్తుడి నమ్మకం, విశ్వాసం, కోరిక ఉంటుందని భక్తులు చెబుతారు.

