కలం, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ లైన్‌కు భిన్నంగా మాట్లాడేవారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవడంలో ఒక్కో సామాజికవర్గానికి ఒక్కో రకమైన విధానం అమలవుతున్నదనేది ఆ చర్చల్లో వినిపిస్తున్న మాట. క్రమశిక్షణను ఉల్లంఘించినవారిపై చర్యల సంగతి ఎలా ఉన్నా షోకాజ్ నోటీసులు ఇవ్వడంలో వివక్ష కనిపిస్తుందని పలువురు ఆరోపణ చేస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం నేతలు చేసిన కామెంట్లపై సాఫ్ట్ కార్నర్‌తో ఉంటున్న పీసీసీ.. బీసీ, ఎస్సీ లీడర్ల విషయంలో హార్డ్ స్టాండ్ తీసుకుంటుందని గాంధీభవన్‌లోని కొందరు నేతలు అంటున్నారు.
ఇందుకు గతంలోని తీన్మార్ మల్లన్న, కత్తి వెంకటస్వామి, తాజాగా జక్కిడి శివచరణ్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదాహరణలను ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ‘సోషల్ జస్టిస్’ కీలకమైన పాలసీ అంటూనే దానికి విరుద్ధంగా ఫంక్షనింగ్ ఉంటున్నదని పలువురు వేలెత్తి చూపుతున్నారు. కాంగ్రెస్‌లో ఉంటూనే పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరించినప్పుడు సామాజికవర్గాలతో సంబంధం లేకుండా ఒకే రకమైన ఆచరణ ఉండాలనే సూత్రం గాడి తప్పుతున్నదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
నెలలోనే తీన్మార్ మల్లన్నపై వేటు
పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ నాయకత్వాన్ని బహిరంగంగా విమర్శించిన పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కొందరి నుంచి వివరణలు తీసుకున్నారు. మరికొందరిపై చర్యలు కూడా జరిగాయి. ముఖ్యమంత్రిపైనా, పార్టీ నాయకత్వంపై బహిరంగంగా విమర్శలు చేసిన కొందరు ఇతర నేతల విషయంలో క్రమశిక్షణ కమిటీ వ్యవహరించిన తీరు ఇప్పుడు పార్టీలో చర్చకు కారణమవుతున్నది. గతేడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై తీన్మార్ మల్లన్న బహిరంగంగానే విమర్శలు చేసి ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కులగణనపై చేసిన ప్రకటన ప్రతిని ఆయన దహనం చేశారు. కులగణన బీసీలకు అన్యాయం చేసేలా ఉందని ఆరోపించారు. దీంతో పీసీసీ క్రమశిక్షణ కమిటీ.. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు జారీ చేసి వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. నోటీసుకు సమాధానం ఇవ్వబోనని మల్లన్న బహిరంగంగానే ప్రకటించడంతో రెండు వారాల తర్వాత ఆయనను పార్టీ నుంచి పీసీసీ సస్పెండ్ చేసింది. పార్టీపై విమర్శలు, లైన్‌ను ఉల్లంఘించడమే ఇందుకు కారణమని స్పష్టత ఇచ్చింది.
అప్పట్లోనే బీసీ నేతల నుంచి వ్యతిరేకత
అయితే తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ వ్యవహారం అక్కడితోనే ఆగలేదు. ఆ చర్యను బీసీ కోణంలో కొందరు కాంగ్రెస్ నేతలే ప్రశ్నించారు. మల్లన్నను సస్పెన్షన్‌ను మధుయాష్కీ గౌడ్ ప్రస్తావిస్తూ పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల్లో కులవివక్ష జరుగుతోందంటూ బహిరంగంగానే ఆరోపించారు. రెడ్డి, అగ్రవర్ణ నేతలపై ఒక రకంగా ఇతర సామాజిక వర్గాల నేతలపై మరో రకంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు ఒక టీవీ డిబేట్‌లో ముఖ్యమంత్రిని ఉటంకిస్తూ రేవంత్‌రెడ్డికి రాజకీయ సమయం ముగుస్తోందని, సీఎంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదన్న వ్యాఖ్యలు చేయడంతో కత్తి వెంకటస్వామికి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయన నుంచి వివరణ తీసుకున్నది. తీన్మార్ మల్లన్న, కత్తి వెంకటస్వామి ఇద్దరూ ‘రెడ్డి’, అగ్రవర్ణాల నేతలు కాకపోవడంతో వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఒకరిని సస్పెండ్ చేయడం వంటివి జరిగాయని.. ఇదే తరహాలో పార్టీకి విరుద్ధంగా విమర్శలు చేసిన ‘రెడ్డి’ నేతలకు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదన్న ఉదాహరణలు గాంధీభవన్‌లో చర్చకు దారితీశాయి.
రాజగోపాల్‌రెడ్డి కామెంట్లపై చర్యలేవి?
“కాంగ్రెస్‌కు సంబంధం లేని వ్యక్తులకు కీలక పదవులు వస్తున్నాయి. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యం తగ్గింది. అన్యాయం జరుగుతున్నది. కొత్తగా వచ్చినవారిదే పెత్తనం. ప్రభుత్వంలో అవినీతి పెరిగింది. కాంట్రాక్టర్ల ప్రభావం ఎక్కువైంది. రాష్ట్ర రాజకీయాలను తమిళనాడు తరహాలో మారుస్తాం” అని రెండు రోజుల క్రితం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో సైతం.. “ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నియోజకవర్గానికి నిధులు రావడం లేదు. ముఖ్యమంత్రి సొంత సెగ్మెంట్ కొడంగల్‌కే నిధులు పోతున్నాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. పీసీసీ చీఫ్ వీటిపై స్పందిస్తూ.. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లామని బదులిచ్చారు. రాజగోపాల్‌రెడ్డి గతంలో చేసిన కామెంట్లపై క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని పీసీసీ చీఫ్ వివరణ ఇచ్చినా.. క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి మాత్రం రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం తమ దృష్టికి రాలేదన్నారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యల్లో తప్పు లేదంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మద్దతు పలికారు. ప్రతిపక్షాలు సైతం రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను రాజకీయంగా వాడుకుంటున్నా పీసీసీ చర్యలు తీసుకోకపోవడంలోనా ఆంతర్యం ఏమిటనేది గాంధీభవన్‌లో చర్చనీయాంశమైంది.
పీసీసీ అధ్యక్షుడిపైనే నేతల అసంతృప్తి
రాజగోపాల్‌రెడ్డి మాత్రమే కాక యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్‌రెడ్డి విషయంలోనూ పీసీసీ సాఫ్ట్ గానే ఉన్నదని బీసీ నేతల అభిప్రాయం. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్, ఆమె అనుచరులతో జరిగిన వివాదంలో జక్కిడి శివచరణ్‌రెడ్డి అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ దగ్గర కూడా చర్చ జరిగింది. అయిన శివచరణ్‌రెడ్డిపై షోకాజ్ నోటీసుతోనే పీసీసీ సరిపెట్టిందన్న అసంతప్తి బీసీ నేతల్లో వ్యక్తమైంది. పార్టీలో గత కొంతకాలంగా షోకాజ్ నోటీసులు ఇస్తున్నా చాలా కేసులు క్రమశిక్షణా చర్యల దాకా వెళ్లడం లేదన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ షోకాజ్ నోటీసు జారీచేసిన చాలా సందర్భాల్లో వివరణతోనే సరిపెట్టిందని, చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. ప్రస్తుత ఘటనల స్వభావం, తీవ్రత వేరువేరు అయినా సామాజికవర్గాల కోణం నుంచి చూస్తే వివక్షాపూరితంగా ఉన్నాయనేది గాంధీభవన్‌లో సరికొత్త చర్చకు దారితీసింది. పీసీసీ చీఫ్ స్వయంగా బీసీ అయినా ఆయన తుపాకీ గురి బీసీల మీదకే వెళ్లిందన్నది పలువురు లీడర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యవహారశైలిపై అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.

