కలం, జోగులాంబ గద్వాల: కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రం అందుకున్న వ్యక్తి.. మరుసటి రోజే గుండెపోటుతో మరణించిన విషాద ఘటన గద్వాల (Gadwal) పట్టణంలో చోటు చేసుకుంది. చెనుగోనిపల్లి గ్రామానికి చెందిన జహంగీర్ బాషా (29) గద్వాలలో 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ)గా పనిచేస్తున్నారు. పట్టణంలోని బీడీ కాలనీలో భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నారు. 108 నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు జహంగీర్ శనివారం కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం కూడా అందుకున్నారు.
ఆదివారం ఉదయం ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో జహంగీర్‌కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఇంటి పెద్ద మరణించడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని 108 సిబ్బంది, స్థానికులు కోరారు.

