టెన్త్ స్టూడెంట్స్‌పై ఇంటర్ స్టూడెంట్స్ దాడి.. గాంధీపురంలో ఉద్రిక్తత

​కలం, ఖమ్మం బ్యూరో: కబడ్డీలో ఎదురైన ఓటమితో ఇంటర్ విద్యార్థులు, పదో తరగతి విద్యార్థులపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి (Karepalli) మండలం గాంధీపురం గురుకుల పాఠశాలలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ​స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గురుకులంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో భాగంగా జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో ఇంటర్ విద్యార్థులపై పదో తరగతి విద్యార్థులు విజయం సాధించారు. చిన్న పిల్లల చేతిలో ఓడిపోయామన్న కసితో రగిలిపోయిన ఇంటర్ విద్యార్థులు కక్ష పెంచుకున్నారు.

శనివారం అర్ధరాత్రి వేళ నిద్రిస్తున్న టెన్త్ విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేసి చితకబాదారు. ​భయాందోళనకు గురైన పదో తరగతి విద్యార్థులు ప్రాణాలు దక్కించుకునేందుకు, రాత్రికి రాత్రే పాఠశాల ప్రాంగణం నుంచి బయటకు పరుగులు తీశారు. చీకట్లోనే సమీపంలోని రైల్వే స్టేషన్‌తో పాటు దట్టమైన అటవీ ప్రాంతంలో రాత్రంతా తలదాచుకున్నారు.

​ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న బాధితుల తల్లిదండ్రులు హుటాహుటిన గురుకుల పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. పాఠశాల ఆవరణలోనే పిల్లలపై దాడులు జరుగుతుంటే యాజమాన్యం ఏం చేస్తోందని ప్రిన్సిపల్‌ను, ఉపాధ్యాయులను నిలదీశారు. తీవ్ర గాయాలపాలైన తమ పిల్లలకు న్యాయం చేయాలన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో అధికారులు విచారణ ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>