కలం, జోగులాంబ గద్వాల: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 17వ తేదీ నుంచి జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం తెలిపారు. ఎంపీడీవోలను నోడల్ అధికారులుగా నియమించామని, సంబంధిత అన్ని శాఖల అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు నిర్వహించే ప్రజావాణిలో ప్రజలు ఆర్జీలను సమర్పించవచ్చన్నారు.
ఫిర్యాదులను అధికారులు నిర్దేశిత సమయంలోగా పరిష్కరిస్తారన్నారు. చిన్న చిన్న సమస్యలకే కలెక్టరేట్ వరకు రావాల్సిన అవసరం లేకుండా, మండలాల్లోనే ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. అన్ని శాఖల మండల అధికారులు ప్రజావాణికి సకాలంలో రావాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు.

