తిరుమలకు తీసిపోని తిరుమలయ్య గుట్ట..!

కలం, వనపర్తి : ప్రకృతి అందాలు, అరుదైన ఔషధ వృక్షాలు, ఆధ్యాత్మిక ప్రశాంతత, చల్లని వాతావరణం.. ఇవన్నీ ఒకేచోట ఆస్వాదించాలంటే వనపర్తి సమీపంలోని తిరుమలయ్య గుట్ట (Tirumalayya Gutta) కు వెళ్లాల్సిందే. తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు పొందే సామర్థ్యం కలిగిన ప్రాంతంగా నిలుస్తోంది. ప్రకృతి ప్రసాదించిన ఈ అపూర్వ కానుకను ప్రభుత్వం సమగ్రంగా అభివృద్ధి చేస్తే తెలంగాణలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా వనపర్తి జిల్లా నిలిచే అన్ని అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పర్యాటక పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయమని ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Tirumalayya Gutta
Tirumalayya Gutta Wanaparthy Hidden Gem of Nature Spirituality and Rare Medicinal Plants

తిరుమలయ్య గుట్టకు ఇప్పటికే ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. గుట్టపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి దశాబ్దాలుగా ప్రత్యేక ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. గుట్టపై వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోడానికి నిత్యం భక్తులు వస్తుంటారు. పండుగలు, ప్రత్యేక పూజలు మొక్కుబడులు తీర్చుకోవడానికి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. పెద్దగూడెం–ఆత్మకూరు వంశస్తులు కురుమూర్తి ప్రధాన అర్చకులుగా వంశపారంపర్యంగా సేవలందిస్తున్నారు.

ఆలయ నిర్వహణ బాధ్యతలను మూలమల్ల వంశస్తులు కొనసాగిస్తున్నారు. గతంలో మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో కొంత ఆలయ అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కాగా, దివంగత నందకిషోర్‌ గుప్తా వంశస్తుల ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం నీటి వసతి కల్పించేందుకు సంపు, వాటర్‌ మోటార్‌, నీటి ట్యాంకు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీటితో పాటు ఇతర అవసరాలకు నీటి సౌకర్యం అందుబాటులోకి రానుంది.

ప్రతి అమావాస్య సందర్భంగా ఆలయంలో భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అఖండ భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతి శనివారం ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అనేక మంది భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకుంటారు.

ఇప్పటికీ చాలామంది భక్తులు ఏడు శనివారాలు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో అదే విశ్వాసంతో తిరుమలయ్య గుట్టలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని వరుసగా ఏడు శనివారాలు దర్శించుకుని మొక్కులు తీర్చుకునే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. స్వామివారి మహిమపై భక్తుల్లో విశ్వాసం రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రతి శ్రావణ మాసంలో గుట్టకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరుగుతోంది.

Tirumalayya Gutta

అయితే భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గుట్టపైకి వెళ్లే రహదారి శిథిలావస్థకు చేరి గుంతలు గతుకులు, రోడ్డు విస్తరణ, తాగునీటి సౌకర్యం, పార్కింగ్, విశ్రాంతి మండపాలు, మరుగుదొడ్లు, విద్యుత్ వెలుగులు, సీసీ కెమెరాలు, భద్రతా చర్యలు, క్యాంటీన్, అత్యవసర వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

తిరుమలయ్య గుట్టకు మరో ప్రత్యేకత గుర్తింపు

అరుదైన ఔషధ వృక్ష సంపద, ఔషధ మొక్కలు, పురాణాల్లో ప్రస్తావించిన సంజీవని ఔషధ లక్షణాలకు సమానంగా భావించే అద్భుత ఔషధి ‘సంజీవని’ లక్షణాలు కలిగినట్లు భావించే సెలగినెల్లా బ్రయోప్టెరిస్ మొక్కను వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకుడు సదాశివయ్య ఎనిమిదేళ్ల క్రితమే ఇక్కడ గుర్తించడం విశేషం. తిరుమలయ్య గుట్టలోని వృక్ష జాతులపై విద్యార్థులతో కలిసి నిర్వహించిన పరిశోధనల్లో ఈ అరుదైన మొక్క బయటపడింది.

ప్రభుత్వం వృక్షశాస్త్ర పరిశోధనలను ప్రోత్సహిస్తే ఇలాంటి ఎన్నో విలువైన ఔషధ మొక్కలను గుర్తించి వెలికితీసే అవకాశం ఉందని ఆయన అప్పట్లో సూచించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఔషధ మొక్కల సంరక్షణకు ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో తిరుమలయ్య గుట్ట జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం అత్యంత అవసరంగా మారింది. ఈ ప్రాంతాన్ని మెడిసినల్ ప్లాంట్స్ కన్జర్వేషన్ జోన్గా గుర్తించి ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. దీంతో పరిశోధనలకు, ఔషధ మొక్కల పరిరక్షణకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని అభిప్రాయపడుతున్నారు.

చిన్న ఊటీ తలపించే అతిసుందరమైన ప్రాంతం

శీతాకాలంలో తిరుమలయ్య గుట్టలో ఉండే చల్లని వాతావరణం, పచ్చని అడవులు, సహజసిద్ధమైన కొండలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. తెల్లవారుజామున గుట్టను కమ్మేసే మంచు, పచ్చని చెట్ల మధ్య నుంచి వీచే చల్లని గాలులు, కొండలపై నుంచి కనిపించే వనపర్తి పరిసరాల సుందర దృశ్యాలు పర్యాటకులకు మరపురాని అనుభూతిని కలిగిస్తాయి. విద్యార్థులకు ప్రకృతి అధ్యయన కేంద్రంగా, యువతకు ట్రెక్కింగ్‌కు అనువైన ప్రాంతంగా తిరుమలయ్య గుట్ట అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.

 Tirumalayya Gutta
Tirumalayya Gutta Wanaparthy Hidden Gem of Nature Spirituality and Rare Medicinal Plants

చాలామంది ప్రకృతి ప్రేమికులు ఈ ప్రాంతాన్ని “చిన్న ఊటీ తలపించే ప్రాంతం”గా అభివర్ణిస్తుంటారు. విద్యార్థులకు జీవ వైవిధ్య పరిశోధనలకు ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉంటుంది. వనభోజనాలు, బర్డ్ వాచింగ్, ప్రకృతి విహారం వంటి కార్యక్రమాలకు కూడా తిరుమలయ్య గుట్ట మంచి వేదికగా నిలుస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఒకరోజు విహారయాత్రకు వచ్చే వారికి కూడా ఈ ప్రాంతం అత్యంత అనువైన పిక్నిక్ స్పాట్‌గా మారే అవకాశం ఉంది.

భావితరాలకు గొప్ప వారసత్వం.. ప్రకృతి ప్రసాదించిన అపూర్వ వరం

పర్యాటక శాఖ, అటవీ శాఖ, దేవాదాయ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించి తిరుమలయ్య గుట్టను ఎకో–టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వ్యూ పాయింట్లు, ఎకో పార్క్, ఔషధ మొక్కల ఉద్యానవనం, పిల్లలకు ప్రకృతి విజ్ఞాన కేంద్రం, ట్రెక్కింగ్ మార్గాలు, అడవి సంరక్షణ కేంద్రం, సమాచార కేంద్రం, ఫోటో పాయింట్లు, క్యాంటీన్, పర్యావరణ హిత విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేస్తే తిరుమలయ్య గుట్ట రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాక రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

తిరుమలయ్య గుట్ట అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడంతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వనపర్తి జిల్లాకు ప్రకృతి ప్రసాదించిన ఈ అపూర్వ వరాన్ని ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకుంటే వనపర్తి జిల్లా కొత్త గుర్తింపును సొంతం చేసుకునే అవకాశం ఉంది. గుట్టను రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే వనపర్తి జిల్లా ఖ్యాతి మరింత ఇనుమడించడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి, మరోవైపు ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదం, విద్యార్థులకు విజ్ఞాన కేంద్రం, పరిశోధకులకు ఔషధ వృక్ష సంపద, పర్యాటక రంగానికి నిలయంగా తిరుమలయ్య గుట్టను అభివృద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. భావితరాలకు గొప్ప వారసత్వంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్థానికులు కోరుతున్నారు.

Also Read : అథచమయం ప్రదర్శనతో ఓనం సంబరాలు షురూ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>