కలం, వెబ్ డెస్క్: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) బ్యాక్‌వాటర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా టూర్‌కి వెళ్లిన మిత్రబృందంలో ఒక యువకుడు కృష్ణా నదిలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన దుర్గం తిరుమలేష్ (25) తన మిత్రులతో కలిసి వైజాగ్ కాలనీ బ్యాక్‌వాటర్ ప్రాంతానికి టూర్‌గా వెళ్లారు.
వారంతా గడుపుతున్న సమయంలో తిరుమలేష్ సరదాగా ఈత కొట్టేందుకు కృష్ణా నదిలోకి దిగాడు. అయితే ప్రమాదవశాత్తు నీటిలో లోతు ఎక్కువగా ఉండటం, ప్రవాహం కారణంగా అతను నీట మునిగిపోయాడు. స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వెంటనే సమాచారం అందుకున్న స్థానికులు మరియు రెస్క్యూ టీమ్ సిబ్బంది రంగంలోకి దిగి, యువకుడి కోసం దాదాపు రెండు గంటల పాటు తీవ్రంగా గాలించారు. ఆ తర్వాత తిరుమలేష్ మృతదేహాన్ని వెలికితీశారు. కుటుంబ సభ్యులకు ఆనందాన్ని పంచాల్సిన ట్రిప్ ఇలా తీరని విషాదాన్ని మిగల్చడంతో కొప్పోలు గ్రామంలో తీవ్ర విషాయచ్ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలిసి తిరుమలేష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

