కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడంతో పాటు, పర్యావరణహిత రవాణాను అందించడమే లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 కు అనుగుణంగా తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం – 2026 (Electric Auto Conversion – 2026) రూపకల్పనకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
CURE పరిధిలో పెట్రోల్, డీజిల్ ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చం లేదా కొత్త ఈ ఆటోలతో భర్తీ చేయడం ఈ స్కీమ్ ప్రధాన ఉద్ధేశ్యం అని ఆయన చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న ఆటోలను కొనసాగించాలనుకునే వారు ఎలక్ట్రిక్ కిట్ తో రెట్రోఫిట్టింగ్ చేసుకునే అవకాశం ఉంది. లేదా కొత్త ఎలక్ట్రికల్ ఆటోలను కొనుగోలు చేయాలనుకునే అర్హులకు రూ.1.50 లక్షల సబ్సీడీని ప్రభుత్వం అందిస్తుంది. కొత్త స్కీం అమలుకు ప్రభుత్వం రూ.200 కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించింది.
ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల నుంచి రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.200 కోట్లను సమకూర్చే విధంగా ప్రతిపాదనలు రూపొందించారు. పథకం పారదర్శకంగా అమలు అయ్యేలా మూడు స్థాయిల పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ, పథకం అమలు కమిటీ, జిల్లా మంజూరు కమిటీల ద్వారా పథకం అమలు, లబ్ధిదారుల ఎంపిక, నిధుల మంజూరు తదితర ప్రక్రియలను పర్యవేక్షించనున్నారు.
హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ఆటోలను పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చడం ద్వారా వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో డ్రైవర్లు, యజమానులపై పెరుగుతున్న ఇంధన వ్యయ భారాన్ని తగ్గించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పట్టణ అభివృద్ధి, ఆటో డ్రైవర్ల ఆర్థిక ప్రయోజనాలను సమన్వయం చేస్తూ ఈ పథకాన్ని రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ను స్వచ్ఛమైన గాలి, సుస్థిర ప్రజా రవాణా దిశగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.

