కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళం వేసిన ఓ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును కామారెడ్డి పోలీసులు (Kamareddy Police) వారం రోజుల్లోనే ఛేదించారు. ఈ చోరీకి సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి నుంచి 16 తులాల బంగారు ఆభరణాలు, 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. ఇల్లు ఖాళీగా ఉన్న సమయాన్ని చూసి నిందితుడు చోరీకి పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు.
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని పట్టుకున్నామని చెప్పారు. కేసును వేగంగా ఛేదించిన దేవునిపల్లి సిఐ, ఎస్‌ఐ పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

