సింగరేణి ‘అలియాస్’ పేర్ల నెపంతో వేధింపులా?.. కూనంనేని ఫైర్

కలం, ఖమ్మం బ్యూరో: ​సింగరేణి సంస్థలో సాంకేతిక కారణాలు చూపి ‘అలియాస్’ (మారు పేర్లు) ఉన్న కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు నిరాకరించడం, విజిలెన్స్ వేధింపులకు గురిచేయడం పూర్తిగా అన్యాయమని కొత్తగూడెం ఎమ్మెల్యే, సింగరేణి గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) మండిపడ్డారు. ఈ అన్యాయాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, బాధితుల తరఫున గట్టిగా గళమెత్తుతానని స్పష్టం చేశారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట మార్పు పేర్ల బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.

వేధింపులు దుర్మార్గం..

​ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. గతంలో సింగరేణిలో పనిచేయడానికి ఎవరూ ముందుకు రాని రోజుల్లో పరుగు పందెం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరక్షరాస్యులైన కార్మికులు ఉద్యోగాల్లో చేరారని గుర్తుచేశారు. ఆ సమయంలో అవగాహన లోపంతో పేర్లు, ఇంటి పేర్లు తప్పుగా నమోదయ్యాయని, దాన్ని సాకుగా చూపి ఇప్పుడు విజిలెన్స్ విభాగం వేధింపులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. తండ్రుల అసలు పేర్లతో ధ్రువీకరణ పత్రాలు ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాలు చూపి వారి వారసులకు ఉద్యోగాలు నిరాకరించడం సరికాదన్నారు.

కార్మికులకు అండగా ఉంటాం..

​సింగరేణి సంస్థ వ్యాప్తంగా సుమారు 420 మంది కార్మికులు ఈ సమస్యతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పేర్లు సరిదిద్దుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే వైఖరిని అవలంబించవద్దని హితవు పలికారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగేది లేదని, వారికి సంపూర్ణ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, జిల్లా నాయకులు బాధితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>