కలం, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని దారుల్ ఉలూం నూరియాహనఫియా మదర్సా (Palvancha Madrasa) మువ్వన్నెల పతాక శోభతో మిలమిలలాడింది. మదర్సా ప్రాంగణంలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వేడుకగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మదర్సా ఫౌండర్, చైర్మన్ ఎండీ యాకూబ్ పాషా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు, నిర్వాహకులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ ఎండీ యాకూబ్ పాషా మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఉద్ఘాటించారు. దేశ ఐక్యత, సమగ్రతలను కాపాడుతూ విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలతో భవిష్యత్తు వైపు సాగాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు దేశభక్తి, క్రమశిక్షణ, మానవతా విలువలను జీవితంలో పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు, జాతీయ భావనను చాటే కార్యక్రమాలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎస్.కె. దస్తగిర్, ఎం.డి. ఇక్బాల్, గౌష్ పాషా, గుంషావలి, వసీంలతో పాటు మదర్సా అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

