కలం, మెదక్ బ్యూరో: ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని, పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Raja Narasimha) అన్నారు. సంగారెడ్డిలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి రాజనర్సింహ పాల్గొని మాట్లాడారు. 1988లో మెదక్ ప్రజలు బ్రహ్మరథం పట్టి ఇందిరా గాంధీని ఎంపీగా గెలిపించారన్నారు. మెదక్ జిల్లా అభివృద్ధికి ఇందిరమ్మ ఎంతో కృషి చేశారని, బీడీఎల్ (BDL), బీహెచ్ఈఎల్ (BHEL), ఓడీఎఫ్ (ODF) వంటి భారీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఇక్కడికి తీసుకువచ్చారని కొనియాడారు.
ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను అందిస్తున్నామని తెలిపారు. పేదలను ఆదుకోవడం, నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే కాంగ్రెస్ పార్టీ నైతిక నినాదమని స్పష్టం చేశారు. తెలంగాణలో కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి ‘కోటీశ్వరులు’గా తీర్చిదిద్దిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని హర్షం వ్యక్తం చేశారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల గ్రామీణ పేదలు వలసపోకుండా నిలదొక్కుకున్నారని చెప్పారు. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెస్తూ, ఈ నెల 17వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా టిమ్స్ (TIMS) ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
నైపుణ్యంతో కూడిన విద్యను, మెరుగైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందిస్తూ, సామాజిక భద్రత దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి దామోదర తెలిపారు. తెలంగాణలో పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం, సామాజిక భద్రత, మహిళా సాధికారత కల్పించడమే తమ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.

