రేపు పరకాలకు సీఎం.. అభివృద్ధికి కొత్త ఊపు!

కలం, వరంగల్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం పరకాల (Parakala) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రూ.400 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనుండటంతో పరకాల అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని రెవెన్యూ శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ కలెక్టర్ చాహత్‌ బాజ్‌పాయ్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేతతో కలిసి మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు.

పరకాలలోని అంగడి స్థలంలో భారీ బహిరంగ సభ ప్రాంగణంతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలపై అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షించారు. సుమారు 80 వేల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

వంద పడకల ఆసుపత్రి ప్రారంభం..

గతంలో శంకుస్థాపన చేసిన పరకాల వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని తమ ప్రభుత్వం అవసరమైన నిధులు సమకూర్చి పూర్తి చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కృషి, సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో ఆసుపత్రి అందుబాటులోకి వస్తోందన్నారు. దీంతో పరకాల పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం స్థానికంగానే లభించనుందని చెప్పారు.

6 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు..

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రెండు విడతల్లో పరకాల నియోజకవర్గానికి సుమారు ఆరు వేల ఇళ్లు మంజూరయ్యాయని మంత్రి పొంగులేటి వెల్లడించారు. మొదటి విడతలో 3,500, రెండో విడతలో 2,500 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున సుమారు రూ.300 కోట్ల ఆర్థిక సహాయం అందనుందని పేర్కొన్నారు. అర్హులైన మరిన్ని కుటుంబాలకు కూడా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

పరకాల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. పరకాల మున్సిపల్ ఛైర్మన్ సునీల్‌ కుమార్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేష్‌బాబు, మున్సిపల్ కమిషనర్ పవన్, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్‌ నేత, పరకాల ఆర్డీవో డీఎస్ వెంకన్న, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>