కలం, వెబ్ డెస్క్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) తెలుగు భాషలో మాట్లాడి ఆశ్చర్యపరిచారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి వికసిత్ భారత్ స్వప్నం సాకారమయ్యేలా ప్రతి వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ప్రఖ్యాత తెలుగు కవి గురజాడ అప్పారావు రాసిన పద్యాన్ని చదివి వినిపించారు. ‘దేశమును ప్రేమించుమన్నా.. మంచి అన్నది పెంచుమన్నా.. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అని రాష్ట్రపతి తెలిపారు.
ప్రతి పౌరుడు దేశాన్ని ప్రేమించాలని.. ప్రతి గ్రామం, నగరం అభివృద్ధితో కళకళలాడాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతి తెలుగు పద్యం చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గతంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇదే పద్యాన్ని పార్లమెంటులో చదవగా.. తెలుగు ఎంపీలంతా చప్పట్లతో అభినందించారు.

