ఖమ్మం స్వాతంత్య్ర వేడుకల్లో భట్టి.. తెలంగాణ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు!

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించే ప్రజాస్వామ్య పాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని వెల్లడించారు.

భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఖమ్మం (Khammam) పోలీస్ పెరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ఈ ఆశాజనకమైన విజన్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా అమరవీరులు జమలాపురం కేశవరావు, అయితం వెంకటేశ్వర్లు, కొత్త జనార్దన్ రావు, లచ్చమ్మ, జైనాబి, షోయబుల్లా ఖాన్ల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు.

​ఖమ్మం జిల్లా వేదికగా ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించిన డిప్యూటీ సీఎం, వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. రైతు భరోసా కింద 3.41 లక్షల మంది రైతులకు రూ. 427.97 కోట్లు జమ చేయడమే కాకుండా, 1.31 లక్షల మందికి రూ. 912.10 కోట్ల రుణమాఫీ పూర్తి చేసినట్లు తెలిపారు.

అలాగే 803 బాధిత కుటుంబాలకు రైతు బీమా ద్వారా రూ. 40.15 కోట్ల సాయం అందించామన్నారు. రూ. 681.49 కోట్ల విలువైన 2.83 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను మద్దతు ధరకు సేకరించడమే కాక, 129 రైతు వేదికల ద్వారా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

​విద్య, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లోని 27 లక్షల మంది విద్యార్థులకు సెంట్రలైజ్డ్ మెకనైజ్డ్ కిచెన్ల ద్వారా ఉచిత అల్పాహారాన్ని అందిస్తున్నామన్నారు. ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి రూ. 200 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల’ నిర్మాణం వేగంగా సాగుతోందన్నారు.

సాంకేతిక రంగాన్ని బలోపేతం చేసేందుకు పలు నియోజకవర్గాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వైద్య పరంగా ఖమ్మం జీజీహెచ్‌లో రూ. 23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ భవనం పూర్తి చేసి క్యాథ్ ల్యాబ్, సీటీ స్కాన్ సేవలు అందుబాటులోకి తెచ్చామని, వైరా, కూసుమంచిలలో 100 పడకల ఏరియా ఆసుపత్రుల నిర్మాణం సాగుతోందని చెప్పారు.

​మౌలిక వసతులు, నీటిపారుదల రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతూ, సీతారామ ఎత్తిపోతల పథకంలోని పాలేరు లింక్ కాలువ ద్వారా 1.38 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. ఖమ్మం నగరంలో మున్నేరు వరదల నివారణకు రూ. 525.36 కోట్లతో రక్షణ గోడ నిర్మాణం చేపడుతుండగా, రూ. 1,583 కోట్లతో కోదాడ–ఖమ్మం NH-365A నాలుగు వరుసల రహదారి నిర్మాణం 100 శాతం పూర్తయిందన్నారు. మున్నేరుపై రూ. 180 కోట్లతో కేబుల్ వంతెన పనులు వేగవంతం చేశామన్నారు.

​మహిళా సాధికారత, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందుందని భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలు 6.14 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు చేయగా, దానికి సంబంధించిన రూ. 326.73 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వమే భరించిందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం తొలి విడతలో 10,396 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి రూ. 454.97 కోట్లు అందజేశామని, మధిరలో రూ. 2 కోట్ల వ్యయంతో సబ్సిడీపై పాడి గేదెల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు.

ఇక గృహజ్యోతి కింద 2.49 లక్షల కుటుంబాలకు రూ. 257.22 కోట్ల సబ్సిడీతో ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మోడల్ సోలార్ గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. చారిత్రక ఖమ్మం ఖిల్లాపై రూ. 15 కోట్లతో రోప్‌వే ప్రాజెక్ట్ తో పాటు పాలేరు, నేలకొండపల్లి బౌద్ధ స్తూపాల అభివృద్ధికి నిధులు కేటాయించామని, సుదీర్ఘ 96 ఏళ్ల తర్వాత తెలంగాణ సర్వే చట్టం ప్రకారం కాకరవాయి, బేతుపల్లి, భాగవత్‌వీడు గ్రామాల్లో భూ రికార్డుల రీ-సర్వే ప్రక్రియను ప్రారంభించామని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>