కలం, వరంగల్ బ్యూరో: జనగామ జిల్లాలో పేకాట డెన్ పై బచ్చన్నపేట (Bachannapet) పోలీసుల దాడి పలు అనుమానాలకు తావిస్తోంది. పడమటి కేశవాపూర్ శివారులోని పామాయిల్ తోటలో ఈనెల 6న పేకాట ఆడుతుండగా 12మందిని అదుపులోకి తీసుకుని, రూ.2.59 లక్షల నగదు, 3 బైక్‌లు, 13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. అయితే దాడిలో భారీగా నగదు పట్టుబడిందని, 3 కార్లు కూడా ఉన్నాయని స్థానికంగా జోరుగా ప్రచారంలో ఉండగా పోలీసులు వెల్లడించిన లెక్కలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆ కార్లు ఎవరివి?
పట్టుబడిన 12 మందిలో రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, సిద్దిపేట జిల్లాలకు చెందినవారు ఉన్నట్లు తెలిసింది. వారంతా ఇక్కడికి రావడానికి ఉపయోగించిన వాహనాల్లో మూడు నుంచి నాలుగు పెద్ద కార్లు ఉన్నాయని, స్థానికులు చెబుతున్నప్పటికీ పోలీసుల ప్రకటనలో వాటి ప్రస్తావన లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆ కార్లు ఎవరివి? వాటిలో ఎవరు వచ్చారు? దాడి తర్వాత అవి ఎక్కడికి వెళ్లాయి? వాటిని ఎందుకు సీజ్ చేయలేదు? అనే ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిర్వాహకుడిని అరెస్ట్ చేయకపోగా..
పేకాట డెన్ లో పట్టుబడిన నగదులో వాస్తవంగా ఎంత ఉంది? స్వాధీనం చేసుకున్నమొత్తాన్ని లెక్కలోకి తీసుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేకాట డెన్ ను నిర్వాహకుడు కొంతకాలంగా కొనసాగిస్తున్నట్లు ప్రచారంలో ఉండగా.. పోలీసులు ఎందుకు ఆలస్యంగా స్పందించారు..! నిర్వాహకుడికి ముందే సమాచారం ఉన్నా అతడిపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దాడి సమయంలో నిర్వాహకుడు అక్కడే ఉన్నాడని, అనంతరం పోలీసులే బయటకు పంపించారనే ప్రచారం కూడా స్థానికంగా జరుగుతోంది. అయితే.. నిర్వాహకులతో స్థానిక పోలీసులు డీల్ కుదుర్చుకున్నారని, అందులో భాగంగానే కొందరిపైనే కేసులు నమోదు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల తీరుపై పలు అనుమానాలు వెల్లువెత్తుతూ చర్చకు దారితీస్తున్నాయి.
ఉన్నతాధికారుల విచారణే కీలకం
పేకాట డెన్‌పై పోలీసుల దాడి ఆ తర్వాత వెలువడిన అధికారిక లెక్కల్లో నిజమైన గణాంకాలు బయటకు రావాలంటే పోలీసు ఉన్నతాధికారుల విచారణే కీలకమని స్థానికులు అంటున్నారు. ఆరోజు పేకాట డెన్ లో ఎంతమంది ఉన్నారు? ఎంత నగదు పట్టుబడింది? ఎన్ని వాహనాలు అక్కడ ఉన్నాయి? 3 కార్లు ఉంటే వాటిని ఎందుకు కేసులో చూపలేదు? ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు? ఎవరినైనా మధ్యలోనే వదిలేశారా? నిర్వాహకుడి పాత్ర ఏమిటి? అన్న అంశాలపై ప్రశ్నలకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

