కలం, వెబ్ డెస్క్ : ఇండోనేషియాలో ఫ్లోరెస్ ద్వీపం సమీపంలో భారీ భూకంపం (Indonesia Earthquake) సంభవించింది. శనివారం తెల్లవారుజామున సంభవించిన ఈ భారీ భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో నివాసాలు, భవనాలు దెబ్బతిన్నాయి. ఈ భూకంపం తీవ్రత 7.7గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే , స్థానిక అధికారులు వెల్లడించారు. భూ ప్రకంపనల తీవ్రతకు సముద్రపు నీరు అకస్మాత్తుగా వెనక్కి తగ్గడంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఈ క్రమంలోనే ప్రాణభయంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం సముద్రం కావడంతో పాటు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్రంలో 0.5 మీటర్ల నుండి 3 మీటర్ల ఎత్తు వరకు భారీ అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన ప్రదేశాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల కొలంబియాలో సంభవించిన భూంకంపం వల్ల 225 మందికి పైగా మరణించారు. దీంతో తాజా ఇండోనేషియా భూకంప ఘటనతో ఆసియా – పసిఫిక్ ప్రాంత అధికారులు ముందస్తు చర్యలకు దిగారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

