72 కోట్లు నీటిపాలు.. వారానికే కూలిన సీతారామ లింక్ కెనాల్!

కలం, ఖమ్మం బ్యూరో: ప్రాజెక్టుల నిర్వహణ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నా పనుల్లో నాణ్యత మాత్రం పాటించడం లేదు. ఇరిగేషన్ అధికారుల ఉదాసీనత, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలో చేపట్టిన సీతారామ ఎత్తిపోతల (Sita Rama Lift Irrigation) లింక్ కెనాల్ సజీవ సాక్ష్యంగా నిలిచింది. దాదాపు రూ. 72 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ కాలువలోకి నీటి ప్రవాహం ప్రారంభమైన వారం రోజులు కూడా గడవకముందే, సిమెంట్ కాంక్రీట్ సైడ్ వాల్స్ పగుళ్లు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

​కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించిన ఏడాదికే కాలువ సీసీ లైనింగ్ ధ్వంసమవ్వడంపై స్థానిక ప్రజలు, రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కఠినమైన నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని ముందే స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, కాంట్రాక్టర్ వాటిని పట్టించుకోలేదని మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కాంట్రాక్టర్లు నాసిరకం మెటీరియల్‌తో పనులు పూర్తి చేసి చేతులు దులుపుకున్నారని, ఫలతంగా మొదటిసారి నీళ్లు వదలగానే ప్రవాహ ఒత్తిడికి తట్టుకోలేక గోడలు కూలిపోయాయని ఆరోపిస్తున్నారు.

​మరోవైపు ఈ నాసిరకం పనుల బాగోతం బయటపడటంతో విషయం బయటకు రాకుండా కప్పిపుచ్చేందుకు కాంట్రాక్టర్ హుటాహుటిన ప్రయత్నాలు మొదలుపెట్టారు. జేసీబీ యంత్రాల సహాయంతో కూలిపోయిన భాగాలను చదును చేసి సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు ప్రయత్నించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనాన్ని నీటిపాలు చేసిన ఈ వ్యవహారంపై ప్రభుత్వం, ఇరిగేషన్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని, సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన కాంట్రాక్టర్లతోపాటు పర్యవేక్షణలో విఫలమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>