కలం, స్పోర్ట్స్ : భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్ బిచు దేవి (Bichu Devi) రెండో వరల్డ్ కప్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండటమే తన బలమని ఆమె తెలిపింది. ఈ విషయంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనకు ఎంతో స్ఫూర్తి అని చెప్పింది.
ఫుట్‌బాల్ ప్లేయర్ కావాలనుకుని.. హాకీలోకి
బిచు దేవి చిన్నప్పటి కల హాకీ కాదు. ఫుట్‌బాల్ ప్లేయర్ కావాలనే లక్ష్యంతో ఇంఫాల్‌లోని సాయ్ సెంటర్‌కు ఫుట్‌బాల్ ట్రయల్స్ కోసం వెళ్లింది. అయితే అప్పటికే అక్కడ అన్ని స్థానాలు భర్తీ కావడంతో ఆమె హాకీ వైపు మళ్లింది. తండ్రి ప్రోత్సాహంతో హాకీని ప్రయత్నించిన బిచు తొలుత స్ట్రైకర్‌గా ఆడింది. గోల్స్ చేయడం తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. అయితే ఒలింపియన్ నీలకమల్ సూచనతో గోల్‌కీపర్‌గా మారింది. ఆ నిర్ణయమే తన కెరీర్‌కు కీలక మలుపుగా మారింది.
కిట్ కోసం ఆరు నెలలు ఎదురుచూపులు
2015లో మధ్యప్రదేశ్ అకాడమీలో చేరిన తర్వాత కూడా బిచు దేవికి (Bichu Devi) అనేక సవాళ్లు ఎదురయ్యాయి. గోల్‌కీపర్ కిట్ రావడానికి ఏకంగా ఆరు నెలలు పట్టింది. చివరకు కిట్ వచ్చినా అందులోని లెగ్‌గార్డ్స్ ఆమెకు పెద్దగా ఉండటంతో వాటిని కట్ చేసుకుని ఆడాల్సి వచ్చింది. అలాంటి కష్టాలు, అనుభవాలే తనను మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయని బిచు తెలిపింది.
ఈసారి ఒత్తిడికి చోటు లేదు
తన తొలి వరల్డ్ కప్‌లో పెద్ద టోర్నమెంట్ కావడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యానని బిచు గుర్తుచేసుకుంది. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం తన దృష్టి పూర్తిగా ఆటపైనే ఉందని, ప్రపంచంలోని అగ్రశ్రేణి స్ట్రైకర్లను ఎదుర్కోవడంపై ఎలాంటి భయం లేదని చెప్పింది. పెద్ద జట్లతో వరుసగా ఆడటం వల్ల తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని పేర్కొంది.
ధోనీ నుంచి నేర్చుకున్నదిదే..
ఒత్తిడిని ఎదుర్కొనే విషయంలో మహేంద్ర సింగ్ ధోనీ తనకు పెద్ద స్ఫూర్తి అని బిచు దేవి తెలిపింది. పరిస్థితి ఎలా ఉన్నా భావోద్వేగాలను నియంత్రించుకుని సరైన నిర్ణయం తీసుకోవడం ధోనీ నుంచి నేర్చుకున్నానని చెప్పింది. ధోనీ జీవిత ప్రయాణం కూడా తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఆయనపై రూపొందించిన సినిమాను పలుమార్లు చూసినట్లు బిచు వెల్లడించింది.
సవితా పునియా మరో మార్గదర్శి
భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ గోల్‌కీపర్ సవితా పునియా కూడా తనకు ముఖ్యమైన మార్గదర్శి అని బిచు తెలిపింది. సవితను పోటీదారుగా కాకుండా అక్కలా భావిస్తానని చెప్పింది. మ్యాచ్‌లో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా నిర్ణయాలు తీసుకోవాలో సవితను తరచూ అడుగుతానని పేర్కొంది. గోల్‌కీపర్ స్థానంలో ఉన్నప్పుడు ఇద్దరూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటామని, ముఖ్యంగా గోల్ కోల్పోయిన సందర్భాల్లో పరస్పరం ధైర్యం చెప్పుకుంటామని వివరించింది.
చైనాతో తొలి మ్యాచ్
ఆగష్టు 16న చైనాతో భారత మహిళల జట్టు తొలి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే నెలల తరబడి చేసిన సిద్ధతపైనే దృష్టి పెట్టాలని బిచు దేవి తెలిపింది. అదనంగా ఏదైనా చేయాల్సిన అవసరం లేదని, ప్రణాళిక ప్రకారం ఆటపై దృష్టి పెడితే మంచి ఫలితం సాధించగలమనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. రెండో వరల్డ్ కప్‌లో గత అనుభవంతో పాటు ధోనీ, సవితా పునియా వంటి మార్గదర్శుల నుంచి నేర్చుకున్న విషయాలను తన బలంగా మార్చుకున్న బిచు దేవి.. ఈసారి మరింత ధైర్యంగా భారత గోల్‌ను కాపాడేందుకు సిద్ధమవుతోంది.
Also Read : వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐ కీలక బాధ్యతలు?
Follow Us On: Instagram

