కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) ప్రభుత్వ జిల్లా జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ భవేష్ మిశ్రా (Bhavesh Mishra) శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ పరిసరాలు, ఆవరణను ప్రతి అంగుళం పరిశీలించారు. అడుగడుగునా నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితులను చూసి కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడంతస్తుల భవన సముదాయంతో కూడిన ఈ ఆసుపత్రిలో నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని అన్నారు. అనేక చోట్ల డ్రైనేజీ పైప్ లైన్ల లీకేజీలు ఉండడం, ఆసుపత్రి ప్రాంగణంలో వ్యర్థ జలాలు నిలిచి ఉండడం, పరిసరాలు దుర్గంధం వెదజల్లుతూ ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారుల పనితీరును ఆక్షేపించారు.
ప్రత్యేకించి సానిటేషన్ విభాగంలో నెలకొన్న లోపాలను కలెక్టర్ ఎత్తి చూపారు. పరిస్థితి ఇలా ఉంటే చికిత్స కోసం వచ్చే వారు, ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వారు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందన్నారు. ఆస్పత్రి లోపలి భాగంతో పాటు, బయట ప్రాంగణంలోనూ ఏ ఒక్క చోట కూడా నీరు నిల్వ ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలోని ఆవరణలో ఉన్న ఓపెన్ డ్రైనేజీల మీద పైకప్పు నిర్మించాలని, మురుగు జలాలు నిలిచిపోకుండా వాటిని శుభ్రం చేయించాలని సూచించారు. పారిశుద్ధ్య వ్యవస్థను చక్కదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర పరిశీలన జరపాలని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ కు సూచించారు.
ఆస్పత్రి ఆవరణలో చెత్తాచెదారం పేరుకుపోకుండా రోజువారీగా వెంటవెంట తొలగిస్తూ ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని జీజీహెచ్ అధికారులను ఆదేశించారు. ఎక్కడబడితే అక్కడ వృధా నిర్మాణ సామాగ్రి పేరుకుపోయి ఉండటంతో తక్షణమే తొలగించాలని సూచించారు. ఆసుపత్రి ప్రాంగణం రహదారి అంతా గుంతలమయంగా మారినందున, తక్షణమే మరమ్మతులు చేయించాలన్నారు. కుక్కలు, పశువులు ఆసుపత్రి ఆవరణలోకి రాకుండా కట్టడి చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, ఇతర అధికారులు ఉన్నారు.

