చక్కెర ఫ్యాక్టరీని తెరిచి బెల్లం కేంద్రంగా నడపాలి: ఆకుల పాపయ్య

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా సారంగాపూర్‌లో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలని ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ ఆవరణలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సమ్మేళనానికి సుమారు 180 మంది రైతు సంఘం నాయకులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతు సమ్మేళనంలో సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ పునఃప్రారంభం, రైతుల సమస్యలు, చెరకు సాగు ప్రోత్సాహం తదితర అంశాలపై పలు తీర్మానాలు చేసి ఫ్యాక్టరీ ఎండీకి అందించారు.

దశాబ్దాలుగా.. జీవనాధారంగా..

ఈ సందర్భంగా ఆకుల పాపయ్య మాట్లాడుతూ.. సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలోని వేలాది మంది రైతులు, కార్మికులకు దశాబ్దాలుగా జీవనాధారంగా నిలిచిందన్నారు. 1964లో రైతుల వాటాలతో, ప్రభుత్వ సహకారంతో ఏర్పాటైన ఈ ఫ్యాక్టరీని 2008లో మూసివేయడంతో రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఫ్యాక్టరీ మూతపడిన తర్వాత చెరకు సాగు తగ్గిపోయిందని, రైతులు తమ పంటను ఇతర పంట వరి సాగు చేస్తున్నారని వారు అన్నారు.

నిధులు కేటాయించి పునరుద్ధరించాలి..

ఫ్యాక్టరీకి గతంలో 23,143 మంది రైతులు సభ్యులుగా ఉండగా, ప్రతి సంవత్సరం సుమారు 5 నుంచి 6 వేల మంది రైతులు చెరకును సరఫరా చేసేవారని ఆకుల పాపయ్య గుర్తుచేశారు. ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి పైగా ఉపాధి లభించేదని తెలిపారు. రైతుల వాటాలతో ఏర్పడిన పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం కాకుండా ప్రభుత్వమే నిధులు కేటాయించి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

రైతులు సిద్ధంగా ఉన్నారు..

ప్రస్తుతం రైతులు మళ్లీ చెరకు సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం ఫ్యాక్టరీని పునఃప్రారంభించి చెరకు కొనుగోలుకు హామీ ఇస్తే ఈ ప్రాంతంలో చెరకు సాగు తిరిగి పుంజుకుంటుందని అన్నారు. ఫ్యాక్టరీని ఆధునీకరించి చక్కెరతో పాటు బెల్లం వంటి అనుబంధ ఉత్పత్తుల తయారీకి అవకాశం కల్పిస్తే రైతులకు మార్కెట్, మెరుగైన ధరలు లభించడంతో పాటు స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు.

10 వేల మందికి ఉపాధి..

ఈ సందర్భంగా AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమన్న, రైతు నాయకులు సిరిపూర్ గంగారెడ్డి మాట్లాడుతూ.. సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభమైతే ఈ ప్రాంతంలో సుమారు 10 వేల మంది రైతులు, వ్యవసాయ కార్మికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దక్కుతుందని అన్నారు. రైతులు చెరకు సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఫ్యాక్టరీ మూసివేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా ఆలస్యం చేయకుండా ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే రైతులను సమీకరించి వందలాది ట్రాక్టర్లతో “చలో నిజామాబాద్” కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనాధారమైన ఫ్యాక్టరీ కోసం జరిగే పోరాటానికి అందరూ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.

తక్షణమే చర్యలు చేపట్టాలి..

BKS అధ్యక్షులు కొండేలా సాయిరెడ్డి మాట్లాడుతూ.. సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. ఫ్యాక్టరీ తెరవడానికి తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు ఆర్ పృధ్వీరాజ్, ఫాల్దా రాజారెడ్డి, లక్ష్మారెడ్డి, సంతోష్, టేక్మల్ లక్ష్మణ్, కొట్టే గంగాధర, సిర్ప నాగయ్య, సాయిలు, ఎర్రన్న, అర్సపల్లి గోపాల్, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>