కలం, వెబ్ డెస్క్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో (Delhi Security) ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్రం భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఆగస్టు 15న ఎర్రకోట వద్ద జాతీయ జెండా ఎగురవేయనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎర్రకోటలో జరుగనున్న జండా వందనం వేడుకలకు సుమారు 24 వేల మంది అతిథులు రానుండటంతో విశేష ఏర్పాట్లు చేసింది. పుష్కర కాలంగా పరిపాలన సాగిస్తున్న ప్రధాని మోడీ.. ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఎగురవేయనున్నారు.
15 వేల మందితో భారీ భద్రత..
ఈ నేపథ్యంలో ఎర్రకోట పరిసరాల్లో 15 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసింది. వేలిముద్రలతో నేర చరిత్ర పరిశీలన, యాంటీ డ్రోన్ వ్యవస్థలు, స్నైపర్లు, వేలాది మంది భద్రతా సిబ్బందితో ఎర్రకోట చుట్టూ మల్టీ లెవెల్ సెక్యూరిటీ వలయం ఏర్పాటు చేశారు. గుంపులో నేరస్థులు, అనుమానస్పద వ్యక్తులను గుర్తించేందుకు అభిజ్ఞాన్ యాప్ తో పాటు అధిక రిజల్యూషన్ కెమెరాలతో కూడిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ వాహనాలను ఏర్పాటు చేశారు.
1000కి పైగా సీసీ కెమెరాలు..
ఎర్రకోట చుట్టూ 1000కి పైగా సీసీ కెమెరాలను అమర్చారు. అనుమానాస్పద కదలికలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా క్విక్ రియాక్షన్ బృందాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రయాణికులు రద్దీగా ఉండే రైల్వే, మెట్రో స్టేషన్లలో నిఘా పెంచారు. పంద్రాగస్టు వేడుకల దృష్ట్యా ఎర్రకోట పరిసరాల్లో డ్రోన్లు, యూఏవీలపై నిషేధం విధించారు. స్వాతంత్య్ర వేడుకలకు ఉగ్రవాద ముప్పు ఉండటంతో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి.
ట్రాఫిక్ ఆంక్షలు..
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యమైన పరేడ్ మైదానాల పరిసరాల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రధాన రహదారులను మూసివేయనున్నారు. భారీ ట్రాఫిక్ చిక్కుల్లో పడకుండా ఉండాలంటే వాహనదారులు పోలీసులు ప్రకటించిన కొత్త రూట్లు చూసుకొని ప్రయాణం చేయాలి. ఢిల్లీలోని ఎర్రకోట చుట్టుపక్కల ఉన్న అనేక ప్రధాన రహదారులపై అధికారులు రాకపోకలను నిలిపివేశారు. నేతాజీ సుభాష్ మార్గ్, లోథియన్ రోడ్లు ఉదయం 10 గంటల వరకు మూసివేయనున్నారు.

