గోషామహల్‌లో కొత్త నాయకత్వంపై బీజేపీ ఫోకస్

కలం, తెలంగాణ బ్యూరో: గోషామహల్ (Goshamahal) సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) తిరిగి బీజేపీలోకి వచ్చే అవకాశాలు దాదాపు లేవన్న సంకేతాలు వెలువడుతుండడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం కొత్త స్ట్రాటెజీని అమలు చేస్తున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా పలువురు స్థానిక నేతలను ప్రోత్సహిస్తూనే.. నియోజకవర్గంలో చురుగ్గా పనిచేసే నాయకులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది.

రంగంలోకి మాధవీలత

గత లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత కొంతకాలంగా గోషామహల్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యకర్తలు, ప్రజలను కలుస్తున్నారు. ఆమె గోషామహల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పటికీ పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గోషామహల్ నియోజకవర్గ సమస్యలపై మాధవీలత స్పందిస్తున్నారు. రాజాసింగ్ పైనా విమర్శలు చేస్తున్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి ఆమెను బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దింపే అవకాశాలున్నట్లుగా ఊహాగానాలు మొదలయ్యాయి.

వ్యూహంలో భాగమేనా?

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించిన రాజాసింగ్‌ నామినేషన్‌ దాఖలు చేయాలని భావించినప్పటికీ.. చివరి నిమిషంలో రిటర్నింగ్‌ ఆఫీసర్కు సమర్పించలేకపోయారు. పార్టీ తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగానే తాను నామినేషన్‌ దాఖలు చేయలేకపోయానని అప్పట్లో రాజాసింగ్‌ ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజాసింగ్ కు బదులుగా గోషామహల్లో కొత్త నాయకత్వాన్ని తయారు చేయడంపై బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది. మాధవీలతకు వరుసగా లభిస్తున్న రాజకీయ స్పేస్‌.. ఈ వ్యూహంలో భాగమేనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

జనసేన ప్రస్తావన.. మరింత దూరం

రాజాసింగ్ కు గోషామహల్ లో బలమైన వ్యక్తిగత ఓటు బ్యాంక్‌ ఉందన్న విషయాన్ని బీజేపీ నేతలు అంగీకరిస్తున్నారు. అయితే ఆయన ప్రస్తుతం పార్టీలో లేకపోవడంతో.. ఆ లోటును భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీని తెలంగాణ రాజకీయాల్లోకి రావాలంటూ రాజాసింగ్ బహిరంగంగా కోరడం బీజేపీ నాయకత్వానికి మింగుడుపడలేదన్న చర్చ ఉంది. ఇప్పటికే పార్టీకి దూరమైన రాజాసింగ్‌.. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికపై వ్యాఖ్యలు చేయడం కూడా బీజేపీ అసంతృప్తికి కారణమైనట్లు తెలుస్తున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>