కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. గురువారం ఖమ్మం (Khammam CPI) కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో సీపీఐ భారీ పాదయాత్రలు, మహాప్రదర్శన నిర్వహించింది. సీపీఐ నాయకులు బాగం హేమంతరావు, దండి సురేశ్, జమ్ముల జితేందర్ రెడ్డిల నేతృత్వంలో రోటరీనగర్, నయాబజార్, అల్లీపురంల నుంచి ప్రారంభమైన యాత్రలు జెడ్పీ సెంటర్‌కి చేరుకున్నాయి. అక్కడ్నుంచి డప్పు, కోలాట కళాకారుల ప్రదర్శనల నడుమ వందలాది మంది ఎర్రదండులా కదిలారు. వైరా రోడ్డు, పాత బస్టాండ్, మయూరి సెంటర్ మీదుగా భక్తరామదాసు కళాక్షేత్రం వరకు మహాప్రదర్శనగా సాగారు. దారిపొడవునా వీరికి జనాలు పూలమాలలతో స్వాగతం పలికారు.
అనంతరం భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. ప్రధాని మోదీ 145 కోట్ల జనాభా ఉన్న దేశానికి ప్రధానిగా ఉంటూ కార్పొరేట్ శక్తులకే కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ట్రంప్ ఫోబియాతో భయపడుతున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రజలు అనుభవిస్తున్న హక్కులన్నీ కమ్యూనిస్టుల పోరాట ఫలితమేనన్నారు. సీట్లు గెలవకపోవచ్చు గానీ గెలుపోటములను శాసించే శక్తి తమకు ఉందని పేర్కొన్నారు. పొత్తులు, స్థానాల కంటే ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలో సీపీఐ పోటీ చేయడం తథ్యమని ప్రకటించారు.
సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు మాట్లాడుతూ.. సన్నబియ్యం, ఉచిత బస్సు మినహా కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన హామీల అమలులో తాత్సారం చేస్తోందని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో రాజకీయ వివక్ష చూపవద్దని, సీతారామ ప్రాజెక్టు పూర్తి సాధనపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

