కలం, స్పోర్ట్స్ : భారత పారా టేబుల్ టెన్నిస్ స్టార్ నూర్జహాన్ నూర్అలీ జమాని (Nurjahan Noorali Jamani) మరో ఘనత సాధించారు. గుజరాత్ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక ‘సర్దార్ పటేల్ స్పోర్ట్స్ అవార్డు’ను ఆమె అందుకున్నారు. గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి నూర్జహాన్‌కు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఐదేళ్ల వయసులోనే పోలియో బారిన పడిన నూర్జహాన్.. వైకల్యాన్ని అధిగమించి క్రీడల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2007 నుంచి 2010 వరకు పారా టేబుల్ టెన్నిస్‌లో రాణించిన ఆమె.. ఆ తర్వాత దాదాపు పదేళ్లకు పైగా ఆటకు దూరంగా ఉన్నారు.
అద్భుత పునరాగమనం
2022లో తిరిగి క్రీడల్లోకి అడుగుపెట్టిన నూర్జహాన్ అద్భుతంగా రాణించారు. జాతీయ పారా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడంతో పాటు, ఇండోర్‌లో జరిగిన 2025-26 సీనియర్ నేషనల్ టైటిల్‌ను కూడా నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం భారత ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండగా.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27వ స్థానంలో కొనసాగుతున్నారు. అహ్మదాబాద్‌లో నివసిస్తున్న నూర్జహాన్ అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్‌లో జూనియర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
అదానీ స్పోర్ట్స్ లైన్‌కు చెందిన ‘గర్వ్ హై’ పథకం ద్వారా ఆమెకు శిక్షణ, పోటీలకు అవసరమైన మద్దతు లభిస్తోంది. అవార్డు అందుకోవడంపై నూర్జహాన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం మరిన్ని విజయాలు సాధించేందుకు తనకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. తనకు అండగా నిలిచిన అదానీ సంస్థకు కృతజ్ఞతలు చెప్పారు. నూర్జహాన్ పట్టుదల, కృషి ఛాంపియన్లకు స్ఫూర్తిదాయకమని అదానీ స్పోర్ట్స్ లైన్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సంజయ్ అడేసరా అభినందించారు.

