కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా సాగునీటి రక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 1.50 లక్షల ఎకరాలకు శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం భేటీ అయ్యారు. ప్రాజెక్టు పురోగతితోపాటు ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై కార్యాచరణను రూపొందించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సాగర్ ఆయకట్టు పరిధిలోని పంటలు ఎండిపోయే ప్రమాదం ముంచుకొస్తుండటంతో, రైతులను ఆదుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వైరా, లంకసాగర్ ప్రాంతాలకు ఇదివరకే సీతారామ ద్వారా నీటిని విడుదల చేసినప్పటికీ, పంటలు పూర్తిగా చేతికి వచ్చే వరకు మరోసారి నీటిని ఇవ్వాల్సిన అవసరాన్ని మంత్రి తుమ్మల వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయకట్టు పంటలను రక్షించేందుకు రెండు మూడు రోజుల్లోనే నీటిని విడుదల చేయాలని తక్షణమే అధికారులను ఆదేశించారు.
మరోవైపు సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల పరిధిలోని మెట్ట ప్రాంతాలకు గోదావరి జలాలు అందించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కమలాపురంలోని మూడో పంప్‌హౌస్ నుంచి నాలుగో పంప్‌హౌస్ వరకు కాలువ ద్వారా నీటిని తరలించేందుకు రూ.45 కోట్లతో 532 ఎకరాల భూసేకరణను వేగవంతం చేస్తున్నారు. అయితే, నాలుగో పంప్‌హౌస్ నుంచి చెరువులకు కాలువల ద్వారా కాకుండా పైప్‌లైన్ల ద్వారా నీటిని అందించే సరికొత్త ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. పైప్‌లైన్ నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి నిధులు విడుదల చేస్తే, భూసేకరణ వ్యయం తగ్గడంతో పాటు రైతులు తమ విలువైన భూములను కోల్పోవాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లా సాగునీటి రంగంలో కీలకమైన జూలూరుపాడు టన్నెల్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ టన్నెల్ పనులు పూర్తయితే గోదావరి జలాలను నేరుగా పాలేరు జలాశయానికి తరలించే మార్గం సుగమమవుతుంది.

