కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్ కార్డులను ఆధునిక సాంకేతికతతో పాటు కట్టుదిట్టమైన భద్రతతో రూపొందించారు. కొత్త కార్డులను సాధారణ రేషన్ కార్డుల కంటే భిన్నంగా, నకిలీ కార్డులకు అవకాశం లేకుండా తయారు చేశారు. కార్డుపై పౌరసరఫరాల కమిషనర్ సంతకం ఉండటంతో పాటు తెలంగాణ ప్రభుత్వ అధికారిక గుర్తింపును ధ్రువీకరించే ప్రత్యేక అంశాలను పొందుపర్చారు.
స్మార్ట్ రేషన్ కార్డ్ భద్రత కోసం మొత్తం 9 రకాల సెక్యురిటీ ఫీచర్లు (Security Features) ఉండనున్నాయి. ఇందులో పౌరసరఫరాల కమిషనర్ సంతకం, హోలోగ్రామ్, రిలీఫ్ టెక్స్ట్, మైక్రో టెక్స్ట్, డ్యూయల్ హిడెన్ ఇమేజ్, వాటర్ మార్క్, యూవీ లోగో, ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్, గిలోష్ నమూనాలను ఉపయోగించారు.
సెక్యురిటీ ఫీచర్ల వివరాలు పరిశీలిస్తే..
హోలోగ్రామ్:
12 × 16 మిల్లీమీటర్ల పరిమాణంలో తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో ఈ హోలోగ్రామ్ ఉంటుంది.
రిలీఫ్ టెక్స్ట్:
కార్డుపై స్పష్టంగా కనిపించేలా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే ఎంబోస్డ్ అక్షరాలు ఉంటాయి.
మైక్రో టెక్స్ట్:
అత్యంత సూక్ష్మ అక్షరాల్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని కార్డుపై ముద్రిస్తారు.
డ్యూయల్ హిడెన్ ఇమేజ్:
GoTG, ORIGINAL అనే రెండు రహస్య గుర్తులు పొందుపరుస్తారు.
వాటర్‌మార్క్:
తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో వాటర్‌మార్క్ ఉంటుంది.
యూవీ లోగో:
సాధారణ కంటికి కనిపించని విధంగా ఉండే తెలంగాణ ప్రభుత్వ చిహ్నం ఉంటుంది. దీన్ని కేవలం అల్ట్రావయొలెట్ కాంతిలో గుర్తించవచ్చు.
ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్:
20 × 20 మిల్లీమీటర్ల పరిమాణంలో ప్రత్యేకంగా ఎన్కోడ్ చేసిన క్యూఆర్ కోడ్ ఉంటుంది.
గిలోష్ నమూనా:
నకిలీ కార్డులను నిరోధించేందుకు విభిన్నమైన రేఖా నమూనాలను కార్డులో ఉపయోగిస్తున్నారు.
ఇప్పటికే క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త రేషన్ కార్డుల ముద్రణ పూర్తయింది. స్మార్ట్ కార్డులను భారీ భద్రత నడుమ జిల్లాలకు తరలించారు. రాష్ట్రంలో సుమారు 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. కార్డులో వినియోగించిన సాంకేతికతతో రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచడంతో పాటు లబ్ధిదారుల వివరాలను సులభంగా గుర్తించడం, నకిలీ కార్డులను అరికట్టడం వంటి ప్రయోజనాలు కలగనున్నాయి.

