కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా కూసుమంచి (Kusumanchi) మండలంలో మానవత్వానికి మచ్చతెచ్చే దారుణ ఘటనా ఒకటి వెలుగు చూసింది. కడుపున పుట్టిన బిడ్డను కనులార చూసుకోకుండా, అప్పుడే ఊపిరి వదిలిన పసికందును కనీసం పూడ్చిపెట్టేందుకు కూడా మనసొప్పక పంట పొలాల్లో విసిరేసిన ఘాతుకం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
మండల కేంద్రం శివారు ప్రాంతంలోని పంట పొలాల్లో సుమారు 6 నెలల వయస్సు గల నవజాత శిశువు మృతదేహం గురువారం కలకలం రేపింది. స్థానిక రైతు తన పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా ఈ మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న కూసుమంచి ఎస్సై నాగరాజు, ప్రభుత్వ వైద్యాధికారి సాయికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృత శిశువును పరిశీలించారు. గర్భస్రావం (అబార్షన్) చేయించి, ఆ తర్వాత మృతదేహాన్ని ఇక్కడ పొలంలో పడేసి వెళ్లినట్లు వైద్యాధికారి ప్రాథమికంగా ధ్రువీకరించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని గుర్తించేందుకు పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు.

