కలం, ఖమ్మం బ్యూరో: గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపించడం తగదని టీఎస్ యూటీఎఫ్ (TSUTF) జిల్లా కార్యదర్శి డి.ఎస్. నాగేశ్వరరావు మండిపడ్డారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం మూలపోచారంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ నిర్వహించారు. తమ సమస్యలపై సంతకాలు సేకరించి లేఖలు పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ… ఏజెన్సీ ప్రాంతాల్లో వేలాది మంది గిరిజన విద్యార్థులను తీర్చిదిద్దిన పాఠశాలలు నేడు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్నారు. ప్రభుత్వ, జడ్పీ పాఠశాలల్లో పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖలోని 350 నుంచి 400 పోస్టులను అప్గ్రేడ్ చేయకుండా వివక్ష చూపుతోందని ఆరోపించారు. 13 ఏళ్లుగా తాత్కాలిక ఉపాధ్యాయులతో నడుస్తున్న కన్వర్టెడ్ పాఠశాలలకు శాశ్వత పోస్టులు మంజూరు చేయాలన్నారు. విద్యా పర్యవేక్షణకు ట్రైబల్ ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులతోపాటు కంప్యూటర్ ఫ్యాకల్టీ, ఏఎన్ఎం, స్కావెంజర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు, సీనియర్ ఉపాధ్యాయులు శోభన్, రవి, రమేశ్, శ్రీనివాస్, శ్యామల, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

